Share News

KTR: లేని రంకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తు రాలేదా?

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:27 AM

కుంభమేళాకు నిధులు ఇస్తున్న కేంద్రం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఎందుకివ్వదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు ఆధునిక గజనీలుగా మారి ఎన్నికల హామీలను మర్చిపోయారని.. ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టడానికే ఆర్థిక పరిస్థితిపై నెపం నెడుతున్నారని ఆరోపించారు.

KTR: లేని రంకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తు రాలేదా?

  • భార్యాపిల్లలు, కుటుంబాలు మీకేనా?.. వేరేవాళ్లకు ఉండవా?

  • మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా?

  • సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు

  • ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు.. ప్రతీకారంతో మీకే నష్టం

  • తెలంగాణ జాతిపిత ముమ్మాటికీ కేసీఆరే.. బూతుపిత రేవంత్‌ రెడ్డే!

  • ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘లేని రంకులు అంటగట్టి ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడు నీతులు గుర్తురాలేదా? భార్యాపిల్లలు మీకే ఉన్నారా? వేరే వాళ్లకు భార్య పిల్లలు లేరా? వాళ్లకు కుటుంబాలుండవా? సీఎం ఇంటి మీదికి డ్రోన్‌ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యాపిల్లల ఫొటోలను ఇష్టం వచ్చినట్టు తీస్తామంటే ఊరుకుంటాడా? ఇది పద్ధతేనా? మా ఇంట్లో పిల్లల్ని తిట్టింది ఈ కాంగ్రెస్‌ నేతలు కాదా? మా ఇంట్లోని మైనర్‌ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది సీఎం కాదా?’’ అని బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్‌ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై గురువారం శాసనసభలో జరిగిన చర్చ ఆయన పాల్గొంటూ.. సర్కారుపైన, సీఎం రేవంత్‌పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సీఎంకు, కేటీఆర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘కక్ష, పగ, ప్రతీకారం ఉంటే మీకే నష్టం’ అని కేటీఆర్‌ అనగా.. ‘కక్షసాధింపునకు పాల్పడితే సభలో మీరెవ్వరూ ఉండేవారు కాదు’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. దీనికి కేటీఆర్‌.. ‘‘సీఎంకు ఇంత అసహనం పనికిరాదు. ఆయనకు ఇంత ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు’’ అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులూ లేవని.. తెలంగాణకు జరిగిన ఈ అన్యాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగంలో ఒక్క మాట కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం రూ.11,500 కోట్ల ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమపై ముందుకు రావడం లేదని గుర్తుచేశారు. దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడే బీజేపీ నేతలు యాదాద్రికి, వేములవాడకు, కొమురవెల్లి మల్లన్నకు, భద్రాచలం రాముల వారికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. కుంభమేళాకు నిధులు ఇస్తున్న కేంద్రం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఎందుకివ్వదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు ఆధునిక గజనీలుగా మారి ఎన్నికల హామీలను మర్చిపోయారని.. ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టడానికే ఆర్థిక పరిస్థితిపై నెపం నెడుతున్నారని ఆరోపించారు.


ప్రభుత్వం చెప్పాలి

కేంద్రం 5 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ గురించి మాట్లాడుతుంటే.. రేవంత్‌ 1 ట్రిలియన్‌ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారని.. అది ఎలా సాధ్యమో ప్రజలకు వివరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ‘‘బడే భాయ్‌ మాషా అల్లా అంటే ఛోటే భాయ్‌ సుభాన్‌ అల్లా అన్నట్లు’’గా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో తెలంగాణ దివాలా రాష్ట్రంగా కాదు.. దిగ్గజ రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. ‘‘అప్పు పుడుతలేదు.. దివాలా తీసినమని బయట మాట్లాడుతున్న రాము కరెక్టా? సభలో మాట్లాడుతున్న రెమో కరెక్టా?’’ అని సీఎంను ఉద్దేశించి కేటీఆర్‌ వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. ‘‘దావోస్‌ లో పెట్టుబడులు వరదలా తన్నుకొని వచ్చాయని చెప్పుకున్నారు. ఐదు గ్యారంటీలు అమలు చేశాం.. సంక్షేమం అద్భుతంగా ఉందని చెప్పుకొన్నారు. మరి రూ.71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పారో వివరణ ఇవ్వాలి’’ అని నిలదీశారు. ‘ఉద్యోగుల డీఏకు పైసలు లేవు.. ఆరు గ్యారెంటీల అమలుకు పైసలు లేవు.. తులం బంగారానికి పైసలు లేవు..’ అని చెప్పే ముఖ్యమంత్రి రూ.వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తున్నారని, వాటికి నిధులు ఎక్కణ్నుంచి వస్తాయని ప్రశ్నించారు. వాటన్నిటికీ ఉన్న డబ్బులు ఆరు గ్యారెంటీల అమలుకు లేవా అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ నేతలని గోల్డ్‌ అనుకుంటే ఇప్పు డు వారు రోల్డ్‌ గోల్డ్‌ అని తెలిసిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను జైలుకు వెళ్లానని.. మరి సీఎం రేవంత్‌ ఎందు కు జైలుకెళ్లారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ‘‘ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్‌ పడదు. ఏం చేసినా ఫరక్‌ పడదు. పదవి, అధికారం శాశ్వతం అని ఆయన అనుకుంటున్నారు. కానీ అవేవీ శాశ్వ తం కాదు. సీఎంకు అపరిమిత అధికారాలు ఉండ వు. ఆయన ఎవరినీ జైలుకు పంపలేరు. కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు,’’ అని కేటిఆర్‌ స్పష్టం చేశారు. రేవంత్‌ తిట్లన్నీ తమకు దీవెనలేనని.. తెలంగాణ జాతి పిత ముమ్మాటికి కేసీఆర్‌ అని, తెలంగాణ బూతుపిత రేవంత్‌ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ‘రేవంత్‌ రెడ్డి అంటేనే రియల్‌ ఎస్టేట్‌, రియల్‌ ఎస్టేట్‌ అంటేనే రేవంత్‌ రెడ్డి’ అన్న ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో కుప్పకూలిన రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. పేదల మీద ప్రతాపం చూపే హైడ్రా పెద్దలను మాత్రం కాపాడుతోందని.. హైకోర్టు ఎన్నిసార్లు తిట్టినా హైడ్రా తీరు మారట్లేదని కేటీఆర్‌ నిప్పులు చెరిగారు.


కేంద్రం మిథ్య..

రాష్ట్రాలు లేకుంటే కేంద్రం లేదని.. అందుకే ఎన్టీఆర్‌ ‘కేంద్రం మిథ్య’ అన్నారని కేటీఆర్‌ గుర్తు చేశారు. కాంగ్రె్‌సకు ఎనిమిది మంది, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో గుండుసున్నానే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొట్లాడకపోతే కేంద్రం మన మాట వినదు. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు మేమూ కలిసి వస్తాం’’ అని పేర్కొన్నారు. 2014-2020 మధ్య కేంద్ర సర్కారుతో తాముు కూడా సఖ్యతతోనే ఉన్నా రూపాయి నిధులు ఇవ్వలేదని కేటీఆర్‌ ఆగ్రహం వెలిబుచ్చారు.


ఇవి కూడా చదవండి...

ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 03:27 AM