Share News

చేతనైనంత కాలం చేయాలి పని

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:46 PM

‘‘చేతనైనంత కాలం పని చేయాలి.. వయసు 60 దాటినంత మాత్రాన బాధ పడాల్సిన పనేముంది.. వయసుదేముంది..

చేతనైనంత కాలం చేయాలి పని

- చిరు వ్యాపారంతో జీవనోపాధి

- యువతకు ఆదర్శంగా వృద్ధులు

అయిజ టౌన్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : ‘‘చేతనైనంత కాలం పని చేయాలి.. వయసు 60 దాటినంత మాత్రాన బాధ పడాల్సిన పనేముంది.. వయసుదేముంది.. ఏటికేడు పెరుగుతనే ఉంటది.. సొంత అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా బతకాలి.. అయిన వారైనా సరే.. కాని వారైనా సరే.. చేయి చాచి వారిని అడిగే అవసరం లేకుండా జీవించాలి’’ అంటున్నారా వృద్ధులు. కానీ చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతున్నారు కొందరు యువకులు.. సులభంగా లక్షల రూపాయలు సంపాదించాలన్న అడ్డదారులు తొక్కుతున్న వారు మరికొందరు.. బెట్టింగులు, ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరుతో డబ్బును తగలేసి అప్పుల పాలవుతున్నారు ఇంకొందరు... ఆశించినది దక్కక కొందరు.. అప్పుల పాలై మరి కొందరు... జీవితాలను ఆగం చేసుకుంటున్నారు.... వారికి బతుకు ఆర్థాన్ని నేర్పిస్తున్నారీ వృద్ధులు. సమస్య ఉన్న చోటే పరిష్కారమూ ఉంటుందని నిరూపిస్తున్నారు. హాయిగా, ఆనందంగా బతికేందుకు లక్షల రూపాయలు అవసరం లేదని చెప్తున్నారు. ఉన్నదానితోనే సంతృప్తిగా జీవించడం ఎలాగో ఆచరించి చూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కొందరిని ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. వారి జీవన శైలిని తెలుసుకున్నది... ఆ వివరాలు..

30 ఏళ్లుగా సీజనల్‌ వ్యాపారం

ఈమె పేరు తెలుగు శంకరమ్మ. అయిజ పట్టణానికి చెందిన ఈమె 30 ఏళ్లుగా ఫుట్‌పాత్‌ మీద చిన్న బండిపై నిమ్మకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. నిమ్మకాయలతో పాటూ ఆయా సీజన్ల వారీగా గంగరెగుపళ్లు, మామిడి పళ్ల వ్యాపారం చేస్తోంది. ఎండ, వాన, చలి ఏ కాలమైనా ఆమె మాత్రం తన వ్యాపారాన్ని ఆపలేదు. పొద్దస్తమానం నిమ్మకాయలు అమ్మితే వచ్చే కొంత డబ్బు ఇంట్లో కూరగాయలకు సరిపోతాయని చెప్తోంది. ఆమె భర్త 10 ఏళ్లుగా కాళ్ల నొప్పులతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇద్దరు కొడుకుల్లో ఒకరు రోజూ తోటలకెళ్లి నిమ్మకాయలు తెస్తారు. మరొకరు సీజన్‌లో మామిడి తోటలను గుత్తకు తీసుకొని జీవనం గడుపుతున్నాడు. సొంత పొలం కూడా లేకపోయినా, చిరు వ్యాపారం ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే తామంతా సంతోషంగా జీవిస్తున్నామని ఆమె తెలిపారు. చేసే పని చిన్నదా, పెద్దదా అని చూడకుండా, ప్రతీ ఒక్కరు నడుము వంచి పని చేసుకోవాలని సూచించారు.

- తెలుగు శంకరమ్మ, అయిజ

కష్టం విలువ తెలుసు

చిన్నప్పటి నుంచి మాకు కష్టం విలువ తెలుసని, అందుకే ఉన్న దాంట్లోనే హాయిగా బతుకుతున్నామని అయిజకు చెందిన భీమక్క చెప్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 62 ఏళ్లు. దాదాపు 40 ఏళ్లుగా రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. సీజనల్‌గా వచ్చే బొప్పాయి, కలంగిరి, జామ, సపోటా తదితర పళ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. భర్త మూడేళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కొడుకులున్నారు. వారికి రెండు ఎకరాల పొలం ఉంది. అయినా ఎవరిపైనా ఆధారపడకుండా బతకాలని, కాళ్లు, చేతులు పని చేసినన్ని రోజులు తనకు నచ్చిన పని చేస్తూ బతకడమే తన ఆలోచన అని ఆమె తెలిపారు. ఎండనకా, వాననకా రోజంతా బండిపై కూర్చుని పండ్లు అమ్మితే రెండు వందల రూపాయల వరకు వరకు మిగులుతాయని చెప్పారు. రోజూ ఇంటి నుండి పండ్లను తీసుకురావడం, తీసుకెళ్లడం, ఆటోకు రూ, 60 ఖర్చు కాగా రూ, 100 నుంచి రూ, 140 వరకు ఆదాయం వస్తోంది. ఉన్నదాంట్లో తృప్తిగా బతకడం మాకు తెలుసని, కానీ నేటి తరం యువతీ, యువకులు పెద్దగా పనిచేయకుండానే డబ్బులు రావాలని ఆరాటపడుతున్నారని, అడ్డదారులు తొక్కుతున్న వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుందన్నారు.

- భీమక్క (ఇందమ్మ), అయిజ

కుటుంబానికి ఆసరాగా ఉండాలని..

ఈమె పేరు మారెమ్మ. వయసు 65 ఏళ్లు. అయిజ మండలంలోని ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన ఈమె 20 ఏళ్లుగా సీజన్‌లో వచ్చే పండ్ల వ్యాపారం చేస్తోంది. తోటల నుంచి పండ్లు కొని, అయిజలో వీధివీధి తిరుగుతూ విక్రయిస్తూ జీవనం గడుపుతోంది. ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకు, కోడలు బతుకుతున్నారు. తాను కూడా ఏదో ఒక పనిచేసి కుటుంబానికి ఆసరగా ఉండాలని ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాటి ముంజలను వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి, వాటిని అయిజ పట్టణంలో వీధివీధి తిరుగుతూ ప్రజలకు, ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల యజమానులకు విక్రయిస్తోంది. మా కాలానికి.. ఈ కాలానికి చాలా తేడా కనిపిస్తోందని ఆమె అంటున్నారు. చాలా మంది పని చేయకుండానే డబ్బులు రావాలని ఆశ పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలకే భయపడి చనిపోవడం చూస్తే బాధ అనిపిస్తోందన్నారు.

- మారెమ్మ, ఎక్లాస్‌పూర్‌

Updated Date - Apr 15 , 2025 | 11:46 PM