Mahesh Kumar Goud: సీఎం, మంత్రుల మధ్య భేషజాలు లేవు
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:34 AM
సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు ఎలాంటి భేషజాలు లేవని, సమష్ఠి నిర్ణయాలతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.

సమష్టి నిర్ణయాలతోనే పథకాల అమలు.. ఆరు నెలలుగా కుంభకర్ణుడిలా కేసీఆర్ నిద్ర
అలాంటి వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల దుష్ప్రచారాన్ని పట్టభద్రులు నమ్మొద్దు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పిస్తాం
ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
నిజామాబాద్/కామారెడ్డి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు ఎలాంటి భేషజాలు లేవని, సమష్ఠి నిర్ణయాలతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలకులపై బీజేపీ, బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బుధవారం పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అనంతరం నిజామాబాద్‌లో కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ ఆరు నెలల పాటు కుంభకర్ణుడిలా నిద్రపోయిన కేసీఆర్.. ఇప్పుడు బయటకు వచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టించామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు త్వరలోనే చట్టం తెస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత పదేళ్లలో 50 వేల ఉద్యోగాలను కూడా బీఆర్‌ఎస్ భర్తీ చేయలేకపోయిందని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి, తప్పిందన్నారు.
ఆ రెండు పార్టీలను నమ్మవద్దని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన నరేందర్‌రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కారణంగానే బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను బరిలో దింపలేదన్నారు. కేవలం కాంగ్రె్‌సను ఓడించాలన్నదే ఆ రెండు పార్టీల లక్ష్యమని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను అమలులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఉన్నా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చింది గుండుసున్నా అని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలను పట్టభద్రులు నిలదీయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, విజయం సాధించేందుకు కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయదుందుబి మోగించేందుకు దోహదపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పథకాలను ఓటర్లకు వివరించి, నరేందర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మత, కుల రాజకీయాలు చేసే బీజేపీని నమ్మవద్దని పట్టభఽద్రులను కోరారు. మేఽధావులైన పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటువేసి గెలిపిస్తే సొంత నిధులతో పట్టభద్రులందరికీ రూ.3లక్షల మేర బీమా కార్డులు ఇస్తానని నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యలు తనకు తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
టీజేఎస్, వామపక్షాలకు మహే్‌షగౌడ్ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కరీంగనర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం వారికి లేఖలు రాశారు.