Share News

Hyderabad: పర్యాటకానికి అందం

ABN , Publish Date - Feb 22 , 2025 | 03:35 AM

త్వరలో హైదరాబాద్‌ వేదికగా జరగనున్న మిస్‌ వరల్డ్‌ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవేదిక మీద చాటాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతున్నప్పుడు నిర్వాహక రాష్ట్రంవైపు సహజంగానే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి.

Hyderabad: పర్యాటకానికి అందం

  • మిస్‌ వరల్డ్‌ పోటీలతో తెలంగాణ బ్రాండ్‌కు ఊతం

  • మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా..

  • 140 దేశాల నుంచి యువతులు.. 3వేల మీడియా ప్రతినిధులు

  • వారిని రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తాం

  • ఇప్పటికే థీమ్‌ సిద్ధం.. దేశాలన్నీ రాష్ట్రం వైపు చూసేలా ప్రణాళిక

  • ‘ఆంధ్రజ్యోతి’తో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): త్వరలో హైదరాబాద్‌ వేదికగా జరగనున్న మిస్‌ వరల్డ్‌ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవేదిక మీద చాటాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతున్నప్పుడు నిర్వాహక రాష్ట్రంవైపు సహజంగానే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి. దీన్నే అవకాశంగా మలచుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. విభిన్న రంగాల్లో తెలంగాణకు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు, రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు మిస్‌ వరల్డ్‌ పోటీలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది.. మే 7 నుంచి 31 వరకు అంటే 28 రోజుల పాటు భాగ్యనగరంలో మిస్‌వరల్డ్‌ పోటీలు జరుగుతాయి. పోటీల్లో 140 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి 3వేల మంది మీడియా ప్రతినిధులు పాల్గొంటారు. పోటీలు జరిగే రోజులు మినహా మిగతా రోజుల్లో పోటీదారులు సహా ఆయా దేశాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు విభిన్న రంగాల్లో తెలంగాణకు ఉన్న ప్రాముఖ్యాన్ని ఇప్పటికే థీమ్‌ల రూపంలో సిద్ధం చేసింది. మరికొన్ని రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్‌ ఆవల ఉన్న పర్యాటక ప్రాంతాలు రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట క్షేత్రం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ వగైరాలను ఈ పోటీల ద్వారా ప్రమోట్‌ చేయాలని సర్కారు భావిస్తోంది. అలాగే ఈ పోటీల ద్వారా మెడికల్‌ టూరిజం, మౌలిక సదుపాయాలు, భద్రత, విదేశాలతో అనుసంఽధానంపై హైదరాబాద్‌కు ఉన్న సౌలభ్యత, చేనేతలు ఇతర చేతి వృత్తులు, సంప్రదాయ కళలకు అంతర్జాతీయ వేదికపై ప్రాచుర్యం లభిస్తుందని భావిస్తున్నారు. మిస్‌ వరల్డ్‌ పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ‘ఆంధ్రజ్యోతి ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పలు విషయాలను ఆమె వెల్లడించారు. ఆమె మాటల్లోనే..

1 copy.jpg


ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!

‘‘ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణ పర్యాటక శాఖతో పాటు, మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ కలిపి నిర్వహిస్తాయి. పోటీలను ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహిస్తామని మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ప్రతినిధులు రాష్ట్రానికి మొయిల్‌ ద్వారా తెలిపారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రపంచ సుందరి పోటీలు ఇక్కడ నిర్వహించే క్రమంలో తెలంగాణను కూడా ప్రపంచ వేదికపై నిలిపేందుకు ఒక అవకాశం వచ్చింది. 140 దేశాల నుంచి యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వివిధ దేశాల నుంచి 4వేల మంది దాకా మీడియా ప్రతినిధులు వస్తున్నారు. ఫలితంగా మిస్‌ వరల్డ్‌ పోటీలతో పాటు పోటీల్లో పాల్గొనే యువతులు, ఆయా దేశాల ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తారు కాబట్టి.. తెలంగాణ ప్రత్యేకతలేమిటో ఒకేసారి ప్రపంచం ఎదుట ఆవిష్కరించినట్లు అవుతుంది. ఫలితంగా రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణపై పర్యాటకపరంగా ప్రపంచ దేశాల్లో ఆసక్తినెలకొంటుంది. ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసేందుకు వీలుగా మేం కొన్ని థీమ్స్‌ను రూపొందిస్తున్నాం.

హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ థీమ్‌: ఇందులో రాష్ట్రంలో ఉన్న చేనేత, జౌళి శాఖల పరిధిలో ఉంటే వస్తువులు, వస్త్రాలకు సంబంధించిన ప్రదర్శన ఉంటుంది. పోచంపల్లి చీరలు, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల లాంటి ప్రాంతాల్లోని వస్త్రాలను నేసేవారిని ఆహ్వానిస్తాం.. వారి ద్వారా పోటీల్లో పాల్గొనే వారికి వివరించే కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం ఒక భారీ ఈవెంట్లను నిర్వహిస్తాం. ఇప్పటికే తెలంగాణలో నేసిన చీరలు, ఇతర వస్త్రాలకు బయట దేశాల్లో బాగా డిమాండ్‌ ఉంది. ఈ కార్యక్రమంతో మిగిలిన దేశాలకూ మన చీరల ప్రత్యేకతలు తెలుస్తాయి.


కాకతీయ సర్క్యూట్‌ (హెరిటేజ్‌ థీమ్‌): ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న వారసత్వ కట్టడాలను చూపిస్తారు. 800 ఏళ్ల క్రితం కాకతీయుల ఏలుబడిలో నిర్మితమైన రామప్ప ఆలయం, కాకతీయుల చరిత్ర, వేయి స్థంభాల గుడి, మేడారం వనదేవతలు సమ్మక్క-సారక్క ప్రాశస్త్యం, లక్నవరం సరస్సు, ఇలా పలు వారసత్వ కట్టడాలకు సంబంధించిన ప్రాంతాలకు వారిని తీసుకెళ్తాం. ఫలితంగా రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతాయి.

బుద్ధిస్ట్‌ సర్య్కూట్‌: ఈ సర్య్కూట్‌లో ప్రధానంగా బుద్ధవనం, నాగార్జునసాగర్‌ కొండతో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామం దగ్గర ఉన్న దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద బౌద్ధ స్థూపాన్ని చూపనున్నారు. తద్వారా తెలంగాణలోని బుద్ధిస్ట్‌ సర్య్కూట్‌ ప్రపంచానికి తెలుస్తుంది.

సేఫ్టీ థీమ్‌: ప్రపంచ దేశాల నుంచి తెలంగాణ, హైదరాబాద్‌కు వచ్చే ప్రజలకు ఇక్కడున్న భద్రత గురించి వివరిస్తారు. పర్యాటకుల కోసం భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న విషయాలన్నీ ప్రపంచం ఎదుట ఆవిష్కృతమవుతాయి. తెలంగాణలో పర్యటిస్తే సేఫ్‌ అనే భావన పర్యాటకుల్లో కలుగుతుంది.

పెట్టుబడులు: తెలంగాణ ప్రభుత్వం వృద్ధి (గ్రోత్‌) గురించి ఇక్కడి పెట్టుబడులు గురించి కూడా ప్రత్యేకంగా వివరిస్తారు. ప్రపంచలోని ఎన్నో కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి? ఇక్కడ వారికి కల్పించే సౌకర్యాలు ఏమిటి? అనే అంశాలతో పాటు మౌలిక సదుపాయాల గురించి కూడా వివరిస్తారు.


మెడికల్‌ టూరిజం: హైదరాబాద్‌కు అత్యాధునిక వైద్య సేవలకు నిలయం అనే పేరుంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి వివిధ రకాల చికిత్సల కోసం చాలా మంది వస్తున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ఉన్న ఆస్పత్రుల విశిష్టతలు ఏమిటో చెప్పేందుకు పోటీల్లో పాల్గొనే వారిని అక్కడికి తీసుకెళ్లి వారికి తెలియజేస్తాం. ఒక రోజు మొత్తం ఆస్పత్రులు, వాటి ప్రత్యేకతల గురించే తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేశాం.

ఎకో టూరిజం: రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజంపై దృష్టి సారించింది. వికారాబాద్‌ సహా రాష్ట్రంలోని ఎకో టూరిజం ప్రాంతాలన్నింటి దగ్గరికి పోటీల్లో పాల్గొనేవారిని తీసుకెళ్లి, వాటి ప్రత్యేకతలను వివరిస్తాం. ఫలితంగా రాష్ట్రంలోని ఎకో టూరిజం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పెరుగుతాయి.

హస్త కళలు, కళలు: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఒక స్టాల్‌ను ఏర్పాటుచేస్తాం. అక్కడ తెలంగాణలో ఉన్న ఎన్నో రకాల హస్తకళలను ఉంచుతాం. వాటిని ఎలా తయారుచేశారు? వాటి ప్రత్యేకతలేమిటి? అనేది వారికి తెలియజేస్తాం.


గచ్చిబౌలిలో ప్రారంభ కార్యక్రమం

మిస్‌ వరల్డ్‌ పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నామని స్మితా సబర్వాల్‌ పేర్కొన్నారు. పోటీలకు సంబంధించి మార్చి 7, 8 తేదీల్లో అధికారికంగా ప్రకటన వెలువడొచ్చునన్నారు. పోటీలు ఎప్పుడుంటాయి? పోటీల్లో పాల్గొనే వారు రాష్ట్రంలో ఏ రోజు.. ఎక్కడ పర్యటిస్తారు? అనే వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

BJP: సికింద్రాబాద్‌లో బీజేపీ శ్రేణుల సంబురాలు..

Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

Read Latest Telangana News and Telugu News

Updated Date - Feb 22 , 2025 | 03:35 AM