Share News

‘డిండి’కి పూడిక ముప్పు

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:57 PM

డిండి రిజర్వాయర్‌ను పూడిక దెబ్బతీస్తోంది. నీటినిల్వ సామర్థ్యం ఏడాదికేడాదికి క్రమంగా తగ్గుముఖంపడుతోంది

‘డిండి’కి పూడిక ముప్పు

డిండి రిజర్వాయర్‌ను పూడిక దెబ్బతీస్తోంది. నీటినిల్వ సామర్థ్యం ఏడాదికేడాదికి క్రమంగా తగ్గుముఖంపడుతోంది. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ బృందం సర్వే లో నిర్ధారణ కాగా ప్రతి ఏటా 5.39 శాతం నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు వెల్లడైంది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలినాళ్లలో రెండు పంటలకు నీటిని విడుదల చేయగా ఆ తర్వాత దశాబ్దాల పాటు వరద నీరు లేక రిజర్వాయర్‌ నిండిందీ లేదు. సాగుకు నీరందిందీ లేదు. అయితే ఆరేళ్ల నుంచి ఎగువన కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి సీపేజీ నీరు వచ్చిచేరుతుండటంతో ఒక్కపంటకు సాగునీరు సమృద్ధిగా అందుతుండగా, 25 ఏళ్లలో రెండు పర్యాయాలు మాత్రం రెండు పంటలకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 22 అడుగుల మేర నీరున్నప్పటికీ 10 అడుగుల మేర పూడిక ఉండటం గమనార్హం.

- (ఆంధ్రజ్యోతి-డిండి)

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో డిండి రిజర్వాయర్‌ ఒకటి. ప్రస్తుతం నీటిమట్టం క్రమంగా తగ్గిపోతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 36 అడుగులు(2.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 22(ఒక టీ ఎంసీ) అడుగులకు చేరింది. ఎగువన కురిసిన భారీ వర్షాల కు 2024 ఆగస్టు చివరివారంలో రిజర్వాయర్‌ నీటిమట్టం గరిష్ట మట్టానికి చేరుకుంది. ఆయకట్టులో వానాకాలం సీజనలో పంటల సాగుకు సెప్టెంబరు మొదటివారంలో నీటిని విడుదల చేశారు. పంటలు పూర్తయ్యే వరకూ ఎగువ నుం చి నీరు వస్తుండడంతో ప్రాజెక్టు ఓవర్‌ఫ్లో అవుతూ వచ్చిం ది. వానాకాలం సాగుచేసిన వరికోతలు పూర్తయ్యాక యాసంగి వరిసాగుకు ప్రాజెక్టులో నీటిని తీసుకోవాలని 2024న డిసెంబరు 1న తీర్మాణించారు. ఆ మేరకు రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేందుకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని నీటిపారుదలశాఖ అధికారులు సూ చించినప్పటికీ అందుకు భిన్నంగా రైతులు వరి సాగుకే మొ గ్గుచూపారు. 2024 డిసెంబరు 11న యాసంగి సాగుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఎడమకాలువ పరిధిలో 12,500 ఎకరాలతో పాటు కుడికాలువ పరిధిలోని 300 ఎకరాలలో రైతులు సాగుచేశారు. యాసంగి నీటిని విడుదలచేసే సమయంలో రిజర్వాయర్‌ అలుగుపోస్తునే ఉంది. దిగువకు హెడ్‌రెగ్యురేటర్‌ ద్వారా విడుదలవుతున్న 230 క్యూసెక్కులకు అంతేమేర ఎగువ నుంచి ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుండడంతో గరిష్ట నీటిమట్టం 36 అడుగల వద్ద నెల రోజుల పాటు కొనసాగింది. ఎగువ నుంచి ప్రతి రోజూ నీరు వచ్చి చేరుతుండటంతో సుమారు నెల రోజుల నీరు మిగిలాయి. ఇదిలా ఉండగా యాసంగి సీజనలో సాగుచేసి న 12,500 ఎకరాలకు ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు(ఒక టీఎంసీ) సరిపోతుందని అధికారులు అంచనాకు వచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సుమారు 30 రోజు ల్లో ప్రస్తుతం ఉన్న 22 అడుగుల నీటితో పంటలు చేతికొస్తాయని అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

2.61 టీఎంసీల నుంచి 2.4 టీఎంసీలకు...

డిండి రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరదతో పాటు షీల్ట్‌(మట్టి ఇసుక) వచ్చి చేరడంతో ప్రతి ఏడాది 5.39 శాతం నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. 1943 ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటినిల్వ సామర్థ్యం 2.61 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2022న నిర్వహించిన సీడబ్ల్యూసీ సర్వే ప్రకారం 2.4 టీఎంసీలకు తగ్గింది. ప్రతి ఏడాది 0.02 టీఎంసీ మేర నీటినిల్వసామర్థ్యాన్ని ప్రాజెక్టు కోల్పోతూ వస్తోందని సీడబ్ల్యూసి నివేదిక సమర్పించింది.

ప్రాజెక్టులో 10 అడుగుల మేర..

అప్పటి నిజాం ప్రభుత్వం 1940లో డిండి ప్రాజెక్టు పను లు ప్రారంభించగా 1943 జూలైలో పనులు పూర్తయ్యాయి. వర్షాధార ప్రాజెక్టైన డిండి ప్రాజెక్టు గత 80 ఏళ్లలో ఎగువ నుంచి వరద ప్రవాహంతో పాటు ఇసుక, బురద ప్రాజెక్టులోకి కొట్టుకురావడం వల్ల 10 అడుగులమేర పూడిక మేటవేసింది. ప్రారంభంలో రెండు సీజన్లకు సాగునీటిని అందించిన ప్రాజెక్టు క్రమేణ ఒక సీజనకు కూడా నీరు అందించే సామర్థ్యాన్ని పూడిక వల్ల కోల్పోయింది. 1996లో నాబార్డు నిధులు రూ.6.31 కోట్లు ఖర్చు చేసి స్పిల్‌వేను మూ డు అడుగులమేర ఎత్తు పెంచారు. అయినప్పటికీ ఒక్కసా రి ప్రాజెక్టు ఓవర్‌ ప్లో అయినా కూడా సాగుచేసిన వరిపైర్లకు నెల రోజుల నీరు తక్కువపడుతు వచ్చాయి. ప్రాజెక్టులో నీటిని చూసి సాగుచేసిన రైతులు అనేకసార్లు పంటలు ఎండిపోయిన సందర్భలూ ఉన్నాయి.

25 ఏళ్లలో రెండుసార్లు

డిండి ప్రాజెక్టు కట్టిన మొదట్లో రెండు పంటలకు నీరందేది. క్రమేణా ఎగువ నుంచి నీటి రాక లేకపోవడంతో మూడు, నాలుగేళ్లకు రిజర్వాయర్‌ నిండుతుండేది. అయితే 2000 సంవత్సరం తర్వాత నేటి వరకు పాతికేళ్లలో 2021-22లో, 2024-25లో మాత్రమే రెండు పంటలకు నీటిని విడుదల చేశారు. దీంతో వానాకాలం, యాసంగి సీజన్లలో ఆయకట్టులోని 12,500 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఆరేళ్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల సీఫేజ్‌ నీరు వచ్చి చేరుతుండటంతో డిండి ప్రాజెక్టులో నీటి కళ సంతరించుకుంది. నీటి లభ్యత పెరగడంతో పాటు సాగు విస్తీర్ణం పెరిగి ఆయకట్టు రైతులు కొంతమేర ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. రిజర్వాయర్‌పై ఆధారపడిన 400 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయి.

పిల్ల కాల్వల్లో పూడికను తొలగించుకోవాలి

రైతులు తమ పొలాలకు వచ్చే పిల్లకాల్వలోని బురద(పూడిక), గడ్డిని తొలగించుకోవాలి. కాల్వల్లో నీరు సాఫీగా పారేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడం వల్ల పంటలకు నీరు తక్కువ పడదు.

- కొసిరెడ్డి రాజేందర్‌రెడ్డి, రైతు, గోనకోలు

పొదుపుగా వినియోగించాలి

రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. పిల్ల కాల్వలకు మరమ్మతులు చేసుకొని యాసంగిలో సాగుచేసిన పంటలు గట్టేక్కెలా అధికారులకు సహకరించాలి. వాగుల్లో, వంపుల్లో నీరు వృథాగా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

- శ్రీనివాస్‌, డీఈ

Updated Date - Apr 03 , 2025 | 11:57 PM