మదర్‌డెయిరీలో.. అవిశ్వాస సెగ
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:46 AM
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (మదర్‌డెయిరీ) రాజకీయాలకు వేదికగా మా రింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎన్నికైన చైర్మన్‌పై ఆరునెలలకే అవిశ్వాసానికి తెరదింపడం చర్చనీయాంశం గా మారింది.

ప్రస్తుత చైర్మన్‌ను తొలగించాలనే యోచన
స్థానిక ఎమ్మెల్యేలకు పరేషాన్
యాదాద్రి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (మదర్‌డెయిరీ) రాజకీయాలకు వేదికగా మా రింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎన్నికైన చైర్మన్‌పై ఆరునెలలకే అవిశ్వాసానికి తెరదింపడం చర్చనీయాంశం గా మారింది. సొంత పార్టీకి చెందిన డైరెక్టర్లే ప్రస్తుతం ఉన్న చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. రెండురోజుల క్రితం 11 మంది డైరెక్టర్లు రహస్యంగా సమావేశమై, అవిశ్వాసంపై చర్చించా రు. వీరిలో తొమ్మిది మంది కాంగ్రె్‌సకు చెందిన వారు కాగా,ఇద్దరు బీఆర్‌ఎస్ డైరెక్టర్లు ఉన్నారు. అవిశ్వాస అంశంపై ఉమ్మడి నల్లగొండతోపాటు రంగారెడ్డి జిల్లాలోని కాంగ్రె స్‌లో చర్చనీయాంశంగా మారింది. చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత ఆరునెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతోపాటు ఉద్యోగులకు సరిగ్గా జీతభత్యాలు ఇవ్వడంలేదని చైర్మన్‌పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారు. మదర్ డెయిరీలో మొత్తం 15 మంది డైరెక్టర్లకు మెజార్టీ సభ్యులు ఆలేరు నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారు. అయితే ఈ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేలను పరేషాన్‌కు గురిచేస్తుంది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పట్టుబట్టి ప్రస్తుతం ఉన్న చైర్మన్‌కు మద్దతు తెలిపారు. అయితే ఆరు నెలలు కాకముందే చైర్మన్‌పై విమర్శలు వ్యక్తం కావడంతోపాటు అవిశ్వాసం వరకు వెళ్లడంతో ఈ వ్యవహారం ఎమ్మెల్యేకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మదర్ డెయిరీ చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలా? డైరెక్టర్ల విన్నపాలను కూడా పట్టించుకోకపోవడమా? పాలసంఘాలకు బిల్లుల మంజూరుపై జాప్యమా? అన్న అంశాలపై పార్టీ అధిష్ఠానం కూడా ఆరా తీస్తోంది. అవిశ్వాసానికి సిద్ధమైన డైరెక్టర్లతో ఇప్పటికే ఎమ్మెల్యేలు చర్చలు జరిపినట్లు తెలిసింది. డైరెక్టర్లు క్యాంపు రాజకీయాలు వీడి..., పార్టీ సూచనల మేరకు నడుచుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే డైరెక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యేను పట్టుబడుతున్నారు. మొత్తం 15మంది డైరెక్టర్లలో చైర్మన్ మినహా అందరూ కూడా అవిశ్వాసానికి మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాను ఎన్నుకున్న చైర్మన్ పదవి కొనసాగించాలా? లేక మెజార్టీ డైరెక్టర్ల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని ఆవిశ్వాసానికి మద్దతు తెలియజేయాలా? అన్న అంశంపై ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు.
అప్పుల ఊబిలో సంస్థ
నల్లగొండ-రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోనే మదర్‌డెయిరీ ఒకప్పుడు రైతుల శ్రేయస్సు, పాడి అభివృద్ధి కోసం పనిచేసింది. అలాంటి సంస్థ రానురాను అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మదర్‌డెయిరీ ఎన్నికల సమయంలో పాడి రైతులకు హామీల వర్షం కురిపించారు. 270 మంది పాల సంఘాల చైర్మన్లతో శిబిరం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపిస్తే రూ.4 బోనస్, ప్రభుత్వం తరఫున రూ.30కోట్ల గ్రాంట్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లిస్తామన్నారు. అయితే పదవి చేపట్టి ఆరునెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. దీంతో పాల సంఘాల చైర్మన్లు సంస్థ పాలకవర్గంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.