పన్ను చెల్లించేది అంతంతేనాయే
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:23 AM
పెరుగుతున్న బంగారం ధరలతో కొంత కొనుగోలు తగ్గినప్పటికీ, రెండు నెలల క్రితం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బంగారంవ్యాపారం కళకళలాడింది.

చెల్లిస్తుంది రోజుకు రూ.150 మాత్రమే
చెల్లించాల్సింది సుమారు రూ.5,400
పెద్దమొత్తంలో పన్నులు ఎగవేస్తున్న బంగారం వర్తకులు
(ఆంధ్రజ్యోతి-కోదాడ)
పెరుగుతున్న బంగారం ధరలతో కొంత కొనుగోలు తగ్గినప్పటికీ, రెండు నెలల క్రితం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బంగారంవ్యాపారం కళకళలాడింది. కొనుగోళ్లకు తగ్గట్టుగా కాకుండా వ్యాపారులు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తుండటంతో జీఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం అంతంతా మాత్రంగానే ఉంది. రోజుకు పావు, అర తులం బంగారం విక్రయం, కొనుగోలు చేయడం వ్యాపారులకు సహజం. అంతవరకు బాగానే ఉన్నా వారికి వస్తున్న ఆదాయంలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం సమకూరడం లేదన్న ఆరోపణలున్నాయి. కొందరు వ్యాపారులు రోజుకు రూ.5వేల వ్యాపారం మాత్రమే జరుగుతుందని, రూ.100కు జీఎస్టీ 3శాతం చొప్పున రూ.150 చెల్లిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఒక్కో దుకాణంలో రోజుకు రెండుతులాల విక్రయాలతో రూ.1.80లక్షల వ్యాపారం జరుగుతోంది.ఆ చొప్పున జీఏస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చెల్లిస్తుంది మాత్రం రూ.150 లు. దీంతో ప్రభుత్వానికి ఆదాయానికి రూ.5,2 50 గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలో 760 దుకాణాలు ఉన్నాయి. వాటిలో 40శాతం దుకాణాదారులు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు ఇస్తూ రోజుకు రూ.15.96లక్షలు, నెలకు రూ.4.78 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాలో రోజుకు రూ.13.68 కోట్ల విక్రయాలు
ఉమ్మడి జిల్లాలో సుమారు 760 దుకాణాలు ఉన్నట్లు సమాచారం. ఆయా దుకాణాల్లో రోజుకు రెండు తులాల చొప్పున విక్రయించినా 1,520 తులాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. తులం రూ.91వేల చొప్పున, నిత్యం ఆయా దుకాణాల్లో రూ.13.68 కోట్ల వ్యాపారం నడుస్తోంది. ఆయా విక్రయాలపై ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో నిత్యం రూ.41.04లక్షల ఆదాయం రావాల్సి ఉంటుంది.
ఉదాసీనతే కారణమా..
అధికారులఉదాసీనతే పన్ను ఎగవేతదారులకు వ రంగా మారింది. వాణిజ్యపన్నుల శాఖలో తగినంత సిబ్బంది లేకపోవటం. తనిఖీలు సక్రమంగా జరగకపోవటంతో కొందరు వ్యాపారులు దానిని అలుసుగా తీసుకొని,తప్పుడులెక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
60శాతం వ్యాపారులు జీఎస్టీ చెల్లింపు
ఉమ్మడి జిల్లాలోని 760 దుకాణదారుల్లో సుమా రు 60శాతం వ్యాపారులు 456మంది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జీఎస్టీ చెల్లిస్తున్నట్లు సమాచారం. విక్రయించినా, కొనుగోలు చేసినా ప్రభు త్వ నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి సహకరిస్తున్నట్లు సమాచారం. తప్పుడులెక్కలు చూపిస్తూ వ్యాపారం చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వారిపై వాణిజ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
రోజుకు రూ.15.96 లక్షల ఆదాయానికి గండి
ఇదిలా ఉండగా 760 దుకాణాల్లో సుమారు 40శాతం దుకాణాల్లో అంటే 304 దుకాణాల్లో రోజుకు రూ.5వేలు మాత్రమే విక్రయాలు జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రోజుకు రూ.15.96 లక్షల ఆదాయానికి గండిపడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆయా దుకాణాల్లో రోజు రెండు తులాల చొప్పున విక్రయించినా 608 తులాలు విక్రయించినట్లు లెక్క. ఆ మేరకు రూ.54,7,20,000 వ్యాపారం జరుగుతున్నట్లు ఆ చొప్పున జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.16.41 లక్షలు రావాల్సి ఉంటుంది. రోజువారీ వ్యాపారం రూ.5వేల చొప్పున 304 దుకాణాల్లో రూ.15.20 లక్షలు మాత్రమేనని, దానికి జీఎస్టీ రూపంలో రూ.4,56,000 మాత్రమే చెల్లిస్తున్నారు. కాగా నిత్యం ప్రభుత్వానికి రూ.15.95 లక్షలు, నెలకు రూ.4.78 కోట్లు, ఏడాదికి రూ.57.43 కోట్ల పన్ను ఎగవేస్తున్నట్లు సమాచారం.