బీఆర్‌ఎ్‌సకు రూ.41 కోట్లు ఎందుకిచ్చారు?
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:14 AM
ఫార్ములా-ఈ కారు రేసు ప్రమోటర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్ కంపెనీ ప్రతినిధులు శనివారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిలో ఆ సంస్థ ఏండీ చలమలశెట్టి అనిల్‌కుమార్ తదితరులు ఉన్నారు.

ప్రమోటర్‌గా చాన్స్ వస్తుందని తెలిసే సంస్థను నెలకొల్పారా?
క్రీడలతో సంబంధం లేని మీరు ఎందుకు ఈ రంగంలోకి దిగారు?
కేటీఆరే ఆహ్వానించారా?.. మధ్యలోనే ఎందుకు వైదొలిగారు?
ఫార్ములా-ఈ కేసులో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ అనిల్‌కు ఏసీబీ ప్రశ్నలు
నష్టం వల్లే తప్పుకొన్నామన్న అనిల్.. మూడున్నర గంటల విచారణ
మరోసారి పిలుస్తామన్న అవినీతి నిరోధక సంస్థ
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు ప్రమోటర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్ కంపెనీ ప్రతినిధులు శనివారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిలో ఆ సంస్థ ఏండీ చలమలశెట్టి అనిల్‌కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. క్రీ డల్లో ఏమాత్రం అనుభవం లేని మీ కంపెనీ ఇందులోకి ఎందుకు దిగింది? ఎవరు మిమ్మల్ని ఆహ్వనించారు? మీకే విధమైన హమీలిచ్చారు? ఒప్పందానికి ముందే బీఆర్‌ఎస్‌కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.41 కోట్ల మొత్తం ఎందుకిచ్చారు? రేసు ద్వారా మీ కంపెనీకి లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ రెండో సెషన్ పూర్తి చేయకుండానే ఎందుకు వైదొలిగారు? తదితర ప్రశ్నలు అడిగారు. మాజీమంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించి కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. ‘ఫార్ములా-ఈ కారు రేసులో ప్రమోటర్‌గా ఉండ బోతున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మిమ్మల్ని ప్రమోటర్‌గా ఆహ్వనించింది కేటీఆరేనా? ప్రమోటర్‌గా అవకాశం లభించనున్న సంగతి తెలిసే.. రేసు ప్రారంభం అవడానికి ముందు ఏస్ నెక్స్ట్‌జెన్, ఏస్ రేస్ కంపెనీలను ప్రారంభించారా? అప్పట్లో మీకు, రాష్ట్ర పురపాలకశాఖకు, అప్పటి మంత్రి కేటీఆర్‌కు మధ్య జరిగిన సంభాషణలేమిటి?’ అంటూ అనిల్ కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
మళ్లీ విచారణకు పిలుస్తాం!
రేసు మొదటి సెషన్‌కు సంబంధించి ‘ఫార్ములా ఈ ఆపరేషన్స్’ (ఎఫ్‌ఈఓ) కంపెనీకి చెల్లించాల్సిన రూ.90 కోట్ల ఫీజును ఏస్ అర్బన్ డెవలపర్స్ నుంచి రుణం రూపంలో ఎందుకు తీసుకున్నారనే కోణంలోనూ ఏసీబీ విచారణ కొనసాగినట్లు సమాచారం. ఏస్ అర్బన్ డెవలపర్స్ కంపెనీ ఏస్ నెక్స్ట్‌జెన్, ఏస్ రేస్ కంపెనీల అనుబంధ సంస్థనే కావటం గమనా ర్హం. కాగా, విచారణకు సమయం తక్కువగా ఉండటంతో మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని, మళ్లీ నోటీసు ఇస్తామని ఏసీబీ అధికారులు అనిల్ కుమార్ బృందానికి తెలిపినట్లు సమాచారం. అధికారుల ప్రశ్నలకు అనిల్ కుమార్ సమాధానమిస్తూ.. అప్పట్లో ఏం జరిగిందనే సంగతిని వివరంగా వెల్లడించినట్లు తెలిసింది. ఎలక్టోరల్ బాండ్లను అన్ని రాజకీయపార్టీలకు ఇచ్చినట్లే బీఆర్‌ఎ్‌సకు ఇచ్చామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. తమ కంపెనీ చట్టపరంగా ఒప్పందం చేసుకుందని, నష్టం రావడంతో రెండో సెషన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని, నాటి అధికారులకు, మంత్రికి చెప్పిన తర్వాతే తప్పుకొన్నామని అనిల్ వెల్లడించారు.
ఆలస్యంగా మొదలైన విచారణ
వాస్తవానికి ఏస్ నెక్ట్స్‌జెన్ కంపెనీ ప్రతినిధులు ఉదయం పదిన్నరకు ఏసీబీ కార్యాలయంలో హజరుకావాల్సి ఉండగా, తమ విమానం ఆలస్యం అయ్యిందని, తమకు కొంత సమయం ఇవ్వాలని వారు ఏసీబీని కోరారు. దీంతో మధ్యాహ్నం తర్వాత విచారణకు రావచ్చని ఏసీబీ అధికారులు సూచించడంతో మధ్యాహ్నం రెండున్నరకు ఏస్ నెక్ట్స్‌జెన్ ఏండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌తో పాటు మరికొందరు ప్రతినిధులు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది.
ఇవీ ఆరోపణలు..
హైదరాబాద్‌లో నాలుగు సెషన్లలో ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహించడం కోసం రాష్ట్ర పురపాలకశాఖ, ఎఫ్‌ఈఓ, ఏస్ నెక్ట్స్‌జెన్ మధ్య 2022 అక్టోబరు 25న త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రమోటర్‌గా ఉంటూ 9, 10, 11, 12 సెషన్లకు సంబంధించిన ఫీజును ఎఫ్‌ఈఓకు వాయిదాల రూపంలో చెల్లించాలి. బ్రిటన్‌కు చెందిన ఏఫ్‌ఈఓతో అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తొలిదఫా చర్చలు జరిపిన తర్వాత.. హఠాత్తుగా ఏస్ నెక్ట్స్‌జెన్, ఏస్ రేస్ కంపెనీలను 2022 జూలైలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కంపెనీల రిజిస్ట్రేషన్‌కు 15 రోజుల ముందే ఏస్ నెక్స్ట్‌జెన్, ఏస్ రేస్ కంపెనీల మాతృసంస్థ గ్రీన్కో నుంచి రూ.10 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు బీఆర్‌ఎస్‌కు అందాయి. దానికి రెండు నెలల ముందు కూడా గ్రీన్కో నుంచే బీఆర్‌ఎ్‌సకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.31 కోట్లు లభించాయి. 9వ సెషన్ పూర్తయిన తర్వాత పదో సెషన్ ప్రారంభానికి ముందే ఏస్ నెక్ట్స్‌జెన్ ఒప్పందం నుంచి వైదొలిగింది. కేటీఆర్ ఆదేశాల మేరకు పుర పాలకశాఖ అధికారులు హెచ్‌ఏండీఏ నుంచి రూ.45.71 కోట్ల మొత్తాన్ని ఎఫ్‌ఈఓకు పౌండ్ల రూపంలో చెల్లించారు. వీటన్నింటిపైనా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.