Phone Tapping: శ్రవణ్‌రావు అరెస్టు తప్పదా
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:14 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడైన మీడియా అధినేత శ్రవణ్ రావును పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. విచారణకు సహకరించకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యంతర రక్షణ తొలగించమని పోలీసులు కోరే అవకాశం ఉంది. మరోవైపు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విదేశాల నుంచి డిపోర్ట్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల విచారణకు సహకరించని
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు
పెద్దల పేర్లు బయటపెట్టని వైనం
విచారణ పరిణామాలను
సుప్రీంకోర్టుకు తెలపనున్న ప్రభుత్వం
శ్రవణ్‌రావుకు మధ్యంతర
రక్షణ తొలగించాలని కోరే అవకాశం
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడైన మీడియా చానల్ అధినేత శ్రవణ్‌రావును పోలీసులు అరెస్టు చేస్తారా? ఆయనను అరెస్టు చేయకుండా కల్పించిన మధ్యంతర రక్షణను తొలగించాల్సిందిగా సుప్రీంకోర్టును కోరతారా? అంటే.. అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. శ్రవణ్‌రావు వ్యవహారశైలి ఇదేవిధంగా కొనసాగితే ఆయనను అరెస్టు చేయక తప్పదని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. శనివారం పోలీసు విచారణకు హాజరైన శ్రవణ్‌రావు.. విచారణాధికారికి పూర్తిగా సహకరించలేదని తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తనకు వచ్చిన ఆదేశాల మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను పోలీసు అధికారి ప్రణీత్‌రావుకు ఇచ్చానని అంగీకరించిన శ్రవణ్‌రావు.. ఆ పెద్దలు ఎవరంటే మాత్రం మౌనం వహించారని సమాచారం. గతేడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవగా, ఆ వెంటనే శ్రవణ్‌రావు విదేశాలకు పారిపోయారు. దీంతో ‘‘ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే ఎందుకు విదేశాలకు పారిపోయారు? అక్కడి నుంచి ఎవరెవరితో మాట్లాడారు?’’ అని పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్రవణ్‌రావు సూటిగా సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు సెల్‌ఫోన్లలోని వాట్సాప్ సందేశాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించడంతో కొన్ని ప్రశ్నలకు మాత్రం అరకొర జవాబులు ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 2న మరోసారి విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారులు నోటీసు జారీ చేశారు. అప్పటికీ ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటే.. విచారణ తీరును సుప్రీంకోర్టుకు వివరించి శ్రవణ్‌రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాల్సిందిగా పోలీసులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రవణ్‌రావు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ఈ నెల 2న తిరస్కరించడంతో ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శ్రవణ్‌రావు దేశానికి తిరిగి వచ్చి విచారణకు సహకరించదలచుకుంటే అప్పటివరకు ఆయనపై కఠినచర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన విదేశాల నుంచి వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు.
ప్రభాకర్‌రావు వస్తారా?
తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వేసిన పిటిషన్‌పై తీర్పు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఒకవేళ బెయిల్ పిటిషన్ హైకోర్టులో డిస్మిస్ అయితే శ్రవణ్‌రావు తరహాలోనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభాకర్‌రావు భావిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో వచ్చే ఆదేశాల తర్వాత.. స్వదేశానికి తిరిగి రావాలా? లేదా? అనే విషయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈలోపే ప్రభాకర్‌రావును రెడ్‌కార్నర్ నోటీసు ఆధారంగా విదేశాల నుంచి డిపోర్ట్ చేయించడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కుటుంబసభ్యులు, అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు, ఆ సంభాషణలను ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ద్వారా నాటి ఎస్‌ఐబీ టీం విన్నట్లు చార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సంబంధించిన ఫోన్ సంభాషణలు వింటూ వారికి ఆర్థిక సహాయం అందకుండా ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు పనిచేశాయన్న విషయం విచారణలో వెల్లడైంది. అప్పట్లో శ్రవణ్‌రావు ద్వారా కొన్ని ఫోన్ నంబర్లు వీరికి అందాయని, వాటిలో కొన్ని ముగ్గురు మంత్రుల ద్వారా వీరికి అందాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆయా మంత్రులకు, ఫోన్ ట్యాపింగ్‌కు ఉన్న సంబంధాలను బయటపెట్టాలంటే శ్రవణ్‌రావు, ప్రభాకర్‌రావు జరిగిన విషయాలను వివరించాలని, వీరు అడ్డం తిరిగితే సాంకేతిక ఆధారాల ప్రకారం కేసును ముందుకు తీసుకువెళ్లాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News