Gachibowli: 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్!
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:47 AM
వివాదాన్ని పరిష్కరించి, భూముల విషయంలో ముందుకు వెళ్లేందుకు భాగస్వాములందరితో చర్చించడమే ధ్యేయంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా
హెచ్‌సీయూ 1600 ఎకరాల్నీ కలిపి ఏర్పాటు
సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్
సెంట్రల్ పార్కుల తరహాలో వసతులు
హైదరాబాద్‌కే తలమానికంగా నిర్మాణం
భాగస్వాములతో సంప్రదింపులకు యోచన
ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతి పెద్ద పర్యావరణ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా!? అక్కడి 400 ఎకరాల్లోనే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విస్తరించిన 1600 ఎకరాలనూ కలిపి సింగపూర్‌లోని నైట్ సఫారీ, న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ తరహాలో 2000 ఎకరాల్లో అతి పెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేయనుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే జవాబిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాన్ని పరిష్కరించి, భూముల విషయంలో ముందుకు వెళ్లేందుకు భాగస్వాములందరితో చర్చించడమే ధ్యేయంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు. హెచ్‌సీయూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు సహా భాగస్వాములందరితోనూ సంప్రదింపులు జరపనుంది.
కమిటీని నియమించనున్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే, హెచ్‌సీయూ భూములు హైదరాబాద్‌కు అతి పెద్ద ‘లంగ్ స్పేస్’గా ఉన్నాయని పర్యావరణవేత్తలు సహా పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిని అలాగే ఉంచాలనీ వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే, దానిని లంగ్ స్పేస్‌గా కొనసాగించడానికి అక్కడి 2000 ఎకరాల్లోనూ ఎకో పార్కును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సింగపూర్‌లోని నైట్ సఫారీ, న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కు తరహాలో ప్రపంచంలో ఉన్న పర్యాటక ఆకర్షణలపై అధ్యయనం చేయించాలని భావిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరిస్తే.. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా వర్సిటీకి చెందిన 1600 ఎకరాలనూ కలిపి 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి హైదరాబాద్‌కే తలమానికంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. హెచ్‌సీయూకు ఫోర్ట్ సిటీలో స్థలాన్ని ఇవ్వడమే కాకుండా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని భావిస్తోంది. ఈ అంశాలన్నిటిపై భాగస్వాములతో మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News