Supreme Court: మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్ జైలుకే!
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:44 AM
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, జైలుకు వెళతారని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు వెళతారు
కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటి? ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా? చెట్ల నరికివేత కోసం అటవీ అధికారులనుంచి అనుమతులు పొందారా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులను నియమించాల్సిన అవసరమేంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవమేంటి? అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తోంది? వీటన్నిటిపై నివేదిక సమర్పించాలి. - సుప్రీం ధర్మాసనం
మీరు దానినే కోరుకుంటే మేం ఏమీ చేయలేం
వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది
కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్యలు
సీఎస్ అక్కడ పరిశీలించి 16లోపు నివేదిక ఇవ్వాలి
2-3 రోజుల్లోనే వంద ఎకరాల నరికివేతా!?
హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలో విస్తుపోయే అంశాలు
నెమళ్లు, జింకలు పారిపోయినట్లు ఫొటోలున్నాయ్
తదుపరి ఆదేశాలిచ్చే దాకా పనులొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారని, జైలుకు వెళతారని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అక్కడే చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, దానినే కోరుకుంటే తాము చేసేదేమీ ఉండదని, ఎవరూ సహాయం చేయలేరని హెచ్చరించింది. ఇది తీవ్రమైన అంశమని, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించింది. ప్రజా ప్రతినిధుల అనర్హత పిటిషన్లను విచారించడానికి సంసిద్ధమవుతున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్ ధర్మాసనం దృష్టికి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని అమికస్ క్యూరీ, న్యాయవాది పరమేశ్వర్ గురువారం ఉదయం తీసుకెళ్లారు. దీనిని సుమోటోగా తీసుకుని అత్యవసరంగా విచారించాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వివాదాస్పద స్థలానికి స్వయంగా వెళ్లి.. పరిశీలించి.. మధ్యాహ్నం మూడున్నర గంటల్లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఆదేశించింది. అయితే, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, హైకోర్టు విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. నివేదిక వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిద్దామంటూ బదులిచ్చింది. గడువులోపు నివేదిక అందడంతో గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. ‘‘కంచ గచ్చిబౌలిలో పనులు జరుగుతున్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలో లేదు. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలోనే ఉంది. పిటిషనర్లు గూగుల్ చిత్రాల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారు. అది పారిశ్రామిక ప్రాంతం’’ అని నివేదించారు. ఆయన వాదనలతో విభేదించిన ధర్మాసనం.. అది అటవీ ప్రాంతమా? కాదా? అన్నది కాదని, అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. ‘‘హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలో తీవ్ర ఆందోళన కలిగించే విషయాలున్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత జరిగినట్టు, భారీ యంత్రాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఆ విధ్వంస కాండతో అక్కడి నెమళ్లు, జింకలు వేరే ప్రాంతానికి పారిపోయినట్టు చూపించే చిత్రాలను రిజిస్ట్రార్ తన నివేదికలో పొందుపరిచారు. అక్కడ ఒక చెరువు కూడా ఉన్నట్టుంది. రిజిస్ట్రార్ నివేదిక, చిత్రాల ప్రాథమిక పరిశీలన తర్వాత అక్కడ అడవి జంతువులు నివసించేందుకు అనువుగా ఉన్నట్టు అర్థమవుతోంది. అయినా.. అటవీ భూములను గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయని పక్షంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయస్థానం మార్చి 4వ తేదీనే తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకనుగుణంగా
తెలంగాణలోనూ అటవీ భూమి కోసం మార్చి 15న కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అక్కడింకా అటవీ భూములను గుర్తించే చట్టబద్ధమైన కసరత్తు ప్రారంభం కాకుండానే చెట్లను నరికివేయడంలో ఆంతర్యమేమిటి?’’ అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లోనే వందెకరాల్లో చెట్ల నరికివేత ఎంతో తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు. ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా.. చట్టానికి అతీతులు కాదని వ్యాఖ్యానించారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు పిటిషన్ తయారు చేయాలని అమికస్ క్యూరీకి నిర్దేశించింది. మహారాష్ట్రలో చెట్ల నరికివేతపై దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికీ విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారని విద్యార్థుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలోనే, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కంచ గచ్చిబౌలిలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని ధర్మాసనం ఆదేశించింది. ‘‘కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సీఎస్ సందర్శించాలి. ఈనెల 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి. అమికస్ క్యూరీ లేవనెత్తిన ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అటవీ భూమిగా భావిస్తున్న కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు అంత హడావుడిగా చేపట్టాల్సిన అవసరమేంటి?, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధ్రువీకరణ నివేదిక తీసుకుందా?, చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందారా? స్థానిక చట్టాలను అమలు చేశారా!? మార్చి 15న అటవీ భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అటవీ, పర్యావరణ వ్యవహారాల్లో నిపుణులు కాని అధికారులను నియమించాల్సిన అవసరమేంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవమేంటి?, అక్కడ నరికిన చెట్లతో, వచ్చిన కలపను ఏం చేస్తోంది? అనే ప్రశ్నలకు సమాధానాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పించాలి’’ అని సీఎ్‌సకు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలో ఆందోళన కలిగించే విషయాలున్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత జరిగినట్టు, భారీ యంత్రాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఆ విధ్వంస కాండతో అక్కడి నెమళ్లు, జింకలు వేరే ప్రాంతానికి పారిపోయినట్టు చూపించే చిత్రాలను రిజిస్ట్రార్ తన నివేదికలో పొందుపరిచారు. అక్కడ ఒక చెరువు కూడా ఉన్నట్టుంది
- జస్టిస్ బీఆర్ గవాయ్
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News