Share News

Ponguleti: హామీల అమలులో జాప్యం.. ఆర్థిక పరిస్థితి బాగా లేకనే!

ABN , Publish Date - Mar 12 , 2025 | 03:45 AM

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి ఇబ్బందిగా ఉందని, అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.

Ponguleti: హామీల అమలులో జాప్యం.. ఆర్థిక పరిస్థితి బాగా లేకనే!

  • ఇబ్బందులున్నా.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం

  • నెలాఖరులోగా రైతుభరోసా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

వైరా/నేలకొండపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి ఇబ్బందిగా ఉందని, అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురంలో పైలట్‌ ప్రాజెక్టుగా రూ.5.45 కోట్లతో నిర్మించనున్న 109 ఇందిరమ్మ గృహాలకు ఎమ్మెల్యే మాలోతు రాందా్‌సనాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లి మండలం నాచేపల్లి గ్రామంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రైతుభరోసా సాయాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిగా చెల్లిస్తామన్నారు. కొందరికి ఇంకా రుణమాఫీ అందని మాట వాస్తవమేనని, ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు.


కేసీఆర్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రూ.7.19 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూనే తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. కేవలం మూడు నెలల్లోనే రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 2004- 2014 కాలంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి ఏపీలో 23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిందని చెప్పారు. ఆ తరువాత కేసీఆర్‌ పదేళ్లలో 1.5 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మాత్రమే మొదలుపెట్టారని, వాటిని కూడా పూర్తిచేయకుండా వదిలేశారని ఆరోపించారు. ప్రస్తుత తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 4.16 లక్షల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందన్నారు. కళ్లుండి చూడలేని కబోదిలా కేసీఆర్‌, కేటీఆర్‌ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ గాండ్రింపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు తమ సమీపంలోని ఏర్లు, వాగుల నుంచి ఇసుక తోలుకుంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని పోలీసుశాఖను మంత్రి పొంగులేటి ఆదేశించారు.

Updated Date - Mar 12 , 2025 | 03:45 AM