Share News

Revenue Decline: రిజిస్ట్రేషన్‌ ఆదాయంలో లోటు!

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:55 AM

అనుకున్నట్టుగానే ఈ ఏడాది రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం కాస్త తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నిర్దేశించిన రూ.18వేల కోట్ల లక్ష్యం చేరుకోవడం కష్టమని గుర్తించిన అధికారులు..

Revenue Decline: రిజిస్ట్రేషన్‌ ఆదాయంలో లోటు!

  • గత ఏడాదితో పోలిస్తే రూ.323.8 కోట్లు తక్కువ.. ఈ నెల 29 నాటికి వచ్చింది రూ.14,264.06కోట్లు

  • 2023-24లో వచ్చిన ఆదాయం 14,588.19కోట్లు

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): అనుకున్నట్టుగానే ఈ ఏడాది రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం కాస్త తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నిర్దేశించిన రూ.18వేల కోట్ల లక్ష్యం చేరుకోవడం కష్టమని గుర్తించిన అధికారులు.. కనీసం గత ఏడాది వచ్చిన రూ.14588.06కోట్ల ఆదాయాన్నైనా దాటాలని విస్తృత ప్రయత్నాలు చేశారు. కానీ.. ఈ నెల 29వతేదీ నాటికి రూ.14264.19కోట్ల ఆదాయమే వచ్చింది. ఇది గత ఏడాది కన్నా రూ.323.87కోట్లు తక్కువ కావడం గమనార్హం. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు ఈ నెల 31న ముగియనుండగా.. రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఆది, సోమవారాల్లోనూ(సెలవు రోజుల్లోనూ)తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది ఆదాయాన్ని కచ్చితంగా అధిగమిస్తామని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా 1,302 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరుగుతుందని అధికారులు ఆశించినా.. మార్కెట్‌ అనుకూలించలేదన్న చర్చ జరుగుతోంది.


మార్కెట్‌ ఒడిదుడుకులను అంచనా వేసేందుకు కొంత మంది వేచి చూసే ధోరణిలో ఉన్నారని, ఆ ప్రభావం రిజిస్ర్టేషన్లపై పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భూముల విలువ పెంచుతారనే ప్రచారం జరగడంతో 2024 జూలైలో రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. ఆ నెలలో ఇచ్చిన లక్ష్యానికి మించి ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఆ తర్వాత మళ్లీ క్రయ విక్రయాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఆదాయం వచ్చే రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ప్రభావం పడిందనే చర్చ జరుగుతోంది. దీంతోపాటు ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం, మూసీ సుందరీకరణకు ప్రభుత్వం పూనుకున్నా పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడం, కొత్త ప్రాజెక్టులు ఏ ప్రాంతం వైపు వెళ్తాయో అనే మీమాంస, ఎన్‌ఆర్‌ఐల కొనుగోళ్లు తగ్గడం వంటి కారణాలు ప్రభావం చూపాయన్న వాదన ఉంది. అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై రాయితీకి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 31న ముగియనుండడంతో ఆదివారం(ఉగాది), సోమవారం (రంజాన్‌) సెలవు దినాలైనప్పటికీ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను తెరిచే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ కమిషనర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 01:55 AM