Share News

Bandi Sanjay: సచివాలయంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ సమీక్షనా

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:36 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు సమీక్ష నిర్వహించడం, మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోవడం తెలంగాణలో పాలన భ్రష్టు పట్టడమేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి మజ్లి్‌స గెలిపించేందుకు పని చేస్తున్నారని అన్నారు

Bandi Sanjay: సచివాలయంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ సమీక్షనా

మంత్రివర్గ విస్తరణలో ఏఐసీసీదే నిర్ణయమా

తెలంగాణలో పాలనను భ్రష్టు పట్టించారు

ఎంఐఎంకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్‌

కరీంనగర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సచివాలయంలో మంత్రుల కమిటీతో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌ సమీక్ష చేయడమేంటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంజయ్‌ మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రబ్బర్‌ స్టాంపులా మారారన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారమని, కానీ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించడం.. సచివాలయంలో కాంగ్రెస్‌ నేత సమీక్ష చేయడం, హెచ్‌సీయూ భూముల వ్యవహారం వంటివి తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందనడానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ సొమ్మును దోచుకుని ఢిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు.


హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటై మజ్లి్‌సను గెలిపించాలనుకుంటున్నాయని ఆరోపించారు. దేశద్రోహ ఎంఐఎం, దేశభక్త బీజేపీ మధ్య హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ జరుగుతోందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఏనాడో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కేంద్రం సంక్షేమ పథకాలను తెలంగాణలో పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. సన్నబియ్యం పథకానికి కేంద్రం రూ.37 ఇస్తుంటే రాష్ట్రం రూ.పది మాత్రమే భరిస్తోందని చెప్పారు. అలాంటప్పుడు రేషన్‌ షాపుల వద్ద మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని సంజయ్‌ ప్రశ్నించారు.

Updated Date - Apr 07 , 2025 | 05:36 AM