Subsidized Rice Distribution: సన్నబియ్యం సంబరం
ABN , Publish Date - Apr 02 , 2025 | 02:35 AM
రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. మొదటి రోజు 8.30 లక్షల మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ
ఉదయం నుంచే బారులు తీరిన లబ్ధిదారులు.. తొలిరోజు బియ్యం తీసుకున్న 8.30 లక్షల మంది
18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత.. పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు
రేషన్ షాపులకు చేరిన లక్ష టన్నుల బియ్యం.. మరో రెండు రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : రేషన్ షాపుల్లో సన్నబియ్యం సంబరం మొదలైంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పలు చోట్ల సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 8.30 లక్షల మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నారు. 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మొదటి రోజు పంపిణీ జరిగినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పలుచోట్ల బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త పథకం కావడంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల పరిధిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అన్ని మండలాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. బియ్యం నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా బియ్యం కోటా రేషన్ డిపోలకు చేరిందని, రెండు రోజుల్లో మిగిలిన కోటాను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
కాగా, రైస్‌మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేయించిన బియ్యాన్ని మధ్యంతర గోదాముల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి రేషన్ షాపులకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపులకు చేరింది. మరో లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం రెండు రోజుల్లో చేరుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గత వానాకాలం సీజన్‌లో సేకరించిన 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యంతో 16 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగింది. ఇవి 8 నెలల కోటాకు సరిపోతాయి. మరో నాలుగు నెలలకు యాసంగిలో సేకరించిన ధాన్యంతో బియ్యం సరఫరా చేయనున్నారు.
మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం హాజరు..
రాష్ట్రవ్యాప్తంగా 17,311 చౌకడిపోలు ఉన్నాయి. మంగళవారం 7,623 చౌకడిపోల్లో బియ్యం పంపిణీ చేపట్టారు. జగిత్యాల, నారాయణపేట జిల్లాల్లో మాత్రమే బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ బియ్యం పంపిణీలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.. లబ్ధిదారులతో కలిసి సన్నబియ్యం అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. భువనగిరిలో సన్నబియ్యం పంపిణీ వేదికపై పెట్టిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి ఫొటో లేదని కొందరు బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించారు. అయితే మోదీ ఫొటో ఉందని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి సర్ది చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మోదీ ఫొటో విషయంలో స్వల్ఫంగా ఘర్షణ పడ్డారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం బాగున్నాయంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా గరిడేపల్లి, కనగల్‌లో బియ్యం తీసుకోగానే లబ్ధిదారులు వంట చేసుకున్నారు. గతంలో మార్కెట్లో కొనుగోలు చేసి తీసుకున్న బీపీటీ, సోనా మసూరి తరహాలోనే ఈ సన్నబియ్యం ఉన్నాయని తెలిపారు. దొడ్డుబియ్యం వండితే అన్నం ముద్ద అయ్యేదని, సన్నబియ్యం అన్నం పొడిపొడిగా బాగుందని అన్నారు.
తొలిరోజే ఖాళీ అయిన స్టాక్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సన్న బియ్యం కోసం లబ్ధిదారులు ఉదయం నుంచే బారులు తీరగా పంపిణీలో కొంత జాప్యం జరగడం, ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల లబ్ధిదారుల మధ్య స్వల్పవాగ్వాదాలు జరిగాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు షాపుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సన్న బియ్యం పంపిణీ జరుగుతున్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటాలను రేషన్ షాపుల వద్ద ప్రదర్శించలేదని, దీనిపై ప్రచారం లేదంటూ పలు చోట్ల బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల మోదీ ఫోటోలను వారే ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 15 వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సన్నబియ్యం ఇస్తామని రేషన్ డీలర్లు తెలిపారు.
గతంతో పోలిస్తే మొదటి రోజు జనం తాకిడి పెరిగిందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కేపీహెచ్‌బీ, బాలాజీనగర్ డివిజన్ల డీలర్లు అన్నారు. కాగా, హైదరాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏప్రిల్ 29 వరకు అమల్లో ఉండడంతో.. సన్యబియ్యాన్ని మే నెల నుంచి పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అయితే పోర్టబిలిటీ సౌకర్యం ఉండటంతో.. కొందరు రేషన్ వినియోగదారులు పొరుగున ఉన్న మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వెళ్లి సన్నబియ్యం తీసుకున్నారు. దీంతో ఈ జిల్లాల పరిధిలోని కొన్ని రేషన్ షాపుల్లో మొదటిరోజే స్టాక్ అయిపోయిందని డీలర్లు తెలిపారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెండో విడత స్టాక్‌ను పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News