Telangana rice export: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:10 AM
తెలంగాణలో వరి పండింపులో రికార్డు స్థాయిలో పెరిగిన దిగుబడిని, ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట రావడం, ఎగుమతుల ద్వారా ప్రపంచ మార్కెట్లో తెలంగాణ ప్రవేశించడంతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతి ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
విదేశాలకు బియ్యం ఎగుమతి ఆరంభం మాత్రమేనని వ్యాఖ్య
తొలి విడతగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం రవాణా
హైదరాబాద్/ కాకినాడ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): భారత దేశంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి పండుతుందని తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి గత వానాకాలంలో పండిన 153 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యమే నిదర్శనమని తెలిపారు. సముద్ర మార్గంలో ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతిని ప్రారంభించడానికి సోమవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కాకినాడకు చేరుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాకినాడ నౌకాశ్రయంలో ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానికం గా రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడంతోపాటు ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రానికి బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఖండ దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. ఆగ్నేయాసియాకు బియ్యం ఎగుమతి చేసే చారిత్రక ప్రక్రియ ప్రారంభమైందని.. తద్వారా ప్రపంచ బియ్యం ఎగుమతి మార్కెట్‌లోకి తెలంగాణ ప్రవేశించిందన్నారు. ఫిలిప్పీన్స్- తెలంగాణ ప్రభుత్వాల మధ్య పలు దఫాల సంప్రదింపుల తర్వాత లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతికి ఒప్పందం కుదిరింది.
అందులో భాగంగా తొలిసారి ఫిలిప్పీన్స్‌కు 12,500 మెట్రిక్ టన్నుల ఎంటీయూ-1010, ఐఆర్-64 రకాల బియ్యం.. కాకినాడ నుంచి ఎగుమతి చేస్తున్నామని, ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. 14 శాతం కంటే తక్కువ తేమ గల నాణ్యతా ప్రమాణాలతో కూడిన బియ్యం పంపుతున్నట్లు చెప్పారు. దీనివిలువ రూ.45 కోట్లు ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పౌరసరఫరాల సంస్థ ద్వారా ఫిలిప్పీన్స్ పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు. రాష్ట్ర రైతులకు మేలు చేయడానికే ప్రపంచ దేశాల్లో బియ్యం మార్కెట్ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ప్రతిఏటా ప్రతి పంట గతానికంటే ఎక్కువ దిగుబడి సాధించడానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఈ వానా కాలం సీజన్‌లో రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తే, యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితోపాటు ఈ ఏడాది సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
సీఎంఆర్ బిల్లుల మంజూరులో జాప్యం
రాష్ట్రం నుంచి కేంద్రానికి, ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తున్న బియ్యం.. సీఎంఆర్ బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం వడ్డీభారాన్ని మోయాల్సి వస్తున్నదని చెప్పారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News