East Coast Railway: సరకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే సరికొత్త రికార్డు
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:22 AM
తూర్పు కోస్తా రైల్వే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 259.254 మిలియన్ టన్నుల సరకు రవాణాతో కొత్త రికార్డు నెలకొల్పింది. గత సంవత్సరంతో పోల్చితే 3.034 మిలియన్ టన్నులు అధికంగా రవాణా చేసి రైల్వేలో అగ్రస్థానంలో నిలిచింది

259.254 మిలియన్ టన్నుల రవాణాతో అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరం కంటే 1.2 శాతం వృద్ధి
విశాఖపట్నం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): సరకు రవాణాలో తూర్పు కోస్తా రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 259.254 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి లక్ష్యాన్ని అధిగమించడమే కాకుండా సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 3.034 మిలియన్ టన్నులు అధికంగా (1.2 శాతం) రవాణా చేసింది. భారతీయ రైల్వేలో 259 మిలియన్ టన్నులకు పైగా సరకు రవాణా చేసిన తొలి జోన్‌గా తూర్పుకోస్తా రైల్వే నిలిచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని అధికారులు పేర్కొన్నారు. 153.271 మిలియన్ టన్నుల బొగ్గు, 9.952 మిలియన్ టన్నుల ముడి పదార్థాలు, 21.381 మిలియన్ టన్నుల స్లాగ్, 32.476 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 1.065 మిలియన్ టన్నుల సిమెంట్, 2.989 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 6.772 మిలియన్ టన్నుల ఎరువులు, 2.991 మిలియన్ టన్నుల మినరల్ ఆయిల్, 28.357 మిలియన్ టన్నుల వస్తువులు రవాణా చేసిందని తెలిపారు.
ఈ ఏడాది భారతీయ రైల్వేలో 200 మిలియన్ టన్నులకు పైగా సరకు రవాణా చేసిన జోన్లలో 259.254 మిలియన్ టన్నులతో తూర్పు కోస్తా రైల్వే అగ్రస్థానంలో ఉండగా, సెంట్రల్ రైల్వే 253.208, సౌత్ ఈస్ట్రన్ రైల్వే 212.361, సెంట్రల్ రైల్వే 202.62 మిలియన్ టన్నుల సరకు రవాణాతో తర్వాత స్థానాల్లో నిలిచినట్టు తెలిపారు. అంకితభావంతో విధులు నిర్వహించి సరికొత్త రికార్డు నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించిన వాల్తేరు, సంబల్‌పూర్, ఖుర్దా రోడ్డు డివిజన్ల అధికారులు, సిబ్బందికి జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News