Employees: 6,729 మంది ఔట్
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:50 AM
ఒక్కరు కాదు.. పదులు, వందలు కాదు.. ఏకంగా 6,729 మందిని కొలువుల్లోంచి తొలగించారు. పదవీ విరమణ పొందాక కూడా.. తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం ఇది.

పదవీ విరమణ చేసి, కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటు
రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు
జాబితాలో మెట్రో ఎండీ ఎన్‌వీఎ్‌స రెడ్డి
వైటీడీఏ వీసీ కిషన్‌రావు, సీఈ బీఎల్‌ఎన్ రెడ్డి, పది మంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు కూడా..
సేవలు అవసరమనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి, మళ్లీ అవకాశమివ్వాలి
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
పురపాలక శాఖలోనే 177 మంది తొలగింపు
6 వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు చాన్స్ ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం!
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఒక్కరు కాదు.. పదులు, వందలు కాదు.. ఏకంగా 6,729 మందిని కొలువుల్లోంచి తొలగించారు. పదవీ విరమణ పొందాక కూడా.. తెలంగాణలో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో 6,729 మందిని ఇంటికి పంపింది. ఇలా తొలగించిన వారిలో అటెండర్ మొదలు.. ఐఏఎస్ అధికారి దాకా ఉండడం గమనార్హం..! ఈ జాబితాలో మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎ్‌స రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వైటీడీఏ) వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్‌ఎన్ రెడ్డి.. పది మంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు. ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలైనా అవసరం అని భావిస్తే.. వారిని పునర్నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్, ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్కారు సంచలన నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమమవుతుందనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులతో మునిసిపల్ శాఖ వెంటనే చర్యలను ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ వాటర్‌వర్క్స్, మెట్రోరైల్, రెరా, మెప్మా, కుడా, వైటీడీఏ.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎ్‌సలు, ఆర్డీవోలు, డీఎ్‌ఫవోలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీ శాఖ రేంజ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ల నుంచి, సహాయక ఇంజనీర్ల వరకు ఇలా పలు క్యాడర్లకు చెందిన అధికారులున్నారు.
అదే దారిలో మిగతా శాఖలు
విద్యుత్తు శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించే అవకాశాలున్నాయి. నీటి పారుదల శాఖలో ఇదివరకే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక.. పోలీసు శాఖలోనూ పలువురిని తొలగించగా.. ఇప్పుడు మరికొందరిని ఇంటిదారి పట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ, దేవాదాయం, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ, బీసీ సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు ఇలా పలు కీలక శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కూడా వరుసగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
వంద మందిలోపే.. మళ్లీ చాన్స్!
విశ్రాంత ఉద్యోగుల అవసరం ఉందనుకుంటే.. తాజాగా నియామకాలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. 6,729 మందిలో పునర్నియామకానికి అవకాశాలు 100లోపే ఉంటాయని సచివాలయవర్గాలు చెబుతున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టును ముందు నుంచి పర్యవేక్షిస్తున్న ఎన్‌వీఎస్ రెడ్డికి ఈ కోవలో తిరిగి అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. సాంకేతికపరంగా నైపుణ్యత ఉన్న కొద్దిమంది విశ్రాంత ఉద్యోగులు/అధికారులకే ఆయా శాఖ ల్లో కాంట్రాక్టు పద్ధతిలో పునర్నియామకానికి అవకాశాలుంటాయని సమాచారం.
పదోన్నతులు/రిక్రూట్‌మెంట్లకు చాన్స్
రేవంత్ సర్కారు నియామకాల విషయంలో ముందు నుంచి ఓ స్పష్టతతో ఉంది. ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి, ఆ మేరకు నియామకాలు జరుపుతామని ప్రకటిస్తోంది. ఇప్పటికే 58 వేల నియామకాలను చేపట్టింది. ఇప్పుడు 6,729 మందిని తొలగించిన నేపథ్యంలో.. గ్రూప్1 మొదలు.. గ్రూప్4 స్థాయిలో కొత్త నోటిఫికేషన్ల ద్వారా భర్తీకి అవకాశాలున్నాయని సచివాలయవర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. పదవీ విరమణ పొందినా.. తమ శాఖల్లో కొందరు తిష్టవేసుకుని కూర్చోవడం వల్ల తమకు పదోన్నతులు రావడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే..! తాజా ఉత్తర్వుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News And Telugu News