Share News

నిశ్శబ్దమే అసలు సమస్య!

ABN , Publish Date - Jan 26 , 2025 | 04:52 AM

మన దేశంలో మహిళల ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిశ్శబ్దమేనని హైదరాబాద్‌ సాహితీ మహోత్సవంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.

నిశ్శబ్దమే అసలు సమస్య!

  • మహిళల ఆరోగ్యంపై చర్చించాలి

  • హైదరాబాద్‌ సాహితీ మహోత్సవంలో వక్తలు

  • వాతావరణ మార్పులతోనే పలు వ్యాధులు: సౌమ్య స్వామినాథన్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మన దేశంలో మహిళల ఆరోగ్య పరంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిశ్శబ్దమేనని హైదరాబాద్‌ సాహితీ మహోత్సవంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. తమ ఆరోగ్య సమస్యల గురించి మహిళలు బయటకు వెల్లడించరని, అదే సమస్యగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బియాండ్‌ పీరియడ్స్‌ అండ్‌ ప్రెగ్నెన్సీ ఫర్‌ ఉమెన్స్‌ హెల్త్‌’ అనే అంశంపై శనివారం జరిగిన చర్చలో ఢిల్లీలోని పాపులేషన్‌ కౌన్సిల్‌ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్‌ ఫెలోగా ఉన్న సప్న దేశాయ్‌, గైనకాలజిస్ట్‌ అర్చనా సత్వాల్కర్‌ పాల్గొన్నారు. గర్భాశయ సమస్యలు అయిన ఎండోమెట్రొసిస్‌ లాంటి వాటి గురించి చాలామందికి తెలియదని, వాటి పట్ల మహిళలకు అవగాహన కల్పించాలని సప్న తెలిపారు.


అర్చన మాట్లాడుతూ.. అమ్మాయి రజస్వల అయినప్పుడు పెద్ద ఫంక్షన్‌ చేస్తారు కానీ, ఆ తరువాత నెలసరి గురించి మాట్లాడటమే తప్పన్నట్లు మాట్లాడతారని, అది ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సంభోగ సమయంలో నొప్పి అని చెబుతున్నవారు వారు కూడా ఎక్కువగానే ఉంటున్నారని, నవ వధువుకు అలానే ఉంటుందని పెద్దవారు దీనిని తేలిగ్గా చేసి చెబుతారని, కానీ, దాంట్లో పూర్తి వాస్తవం లేదన్నారు. సెక్స్‌ అనేది ఆహ్లాదంగా ఉండాలి తప్ప నొప్పితో బాధపడేలా ఉండకూడదన్నారు. గర్భనిరోధకాల గురించి కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘పాలసీ పర్‌స్పెక్టివ్స్‌ అండ్‌ ద ప్లానెట్‌’ అనే అంశంపై జరిగిన చర్చలో ఎంఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సౌమ్య స్వామినాథన్‌ మాట్లాడుతూ, వాతావరణ మార్పుల వల్లనే టీబీ లాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. అభివృద్ధి కార్యకలాపాలు భూగోళానికి నష్టం కలిగించవద్దని సూచించారు. ప్రజారవాణాను బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Jan 26 , 2025 | 04:52 AM