వైసీపీ నేత చేసే పని వల్ల.. విజయవాడకు ముంపు బెడద!
ABN , First Publish Date - 2020-03-18T09:59:23+05:30 IST
ఓ వైపు ఎన్నికల సందడిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంటే మరోవైపు కబ్జారాయుళ్లు గుట్టుగా కబ్జాకాండను పూర్తి చేసేస్తున్నారు.

అధికార దాహానికి.. ‘బుడమేరు’ బలి!
వైసీపీ నేతల రియల్ దందా
చోద్యం చూస్తున్న అధికారులు
ఎన్నికల సందడిలో వైసీపీ నాయకుల కబ్జాకాండ
సింగ్‌నగర్‌లో బుడమేరు వాగు పూడ్చి అర ఎకరం కబ్జా
ప్లాట్లుగా చేసి విక్రయించేసిన వైసీపీ నాయకుడు
పక్కా నిర్మాణాలు జరిగిపోతున్నా పట్టించుకోని వీఎంసీ
రామవరప్పాడు సమీపంలో బుడమేరు కాల్వపై ప్రైవేటు వంతెన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఓ వైపు ఎన్నికల సందడిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంటే మరోవైపు కబ్జారాయుళ్లు గుట్టుగా కబ్జాకాండను పూర్తి చేసేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో అడ్డగోలుగా దందాలు చేస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలోని నందమూరినగర్‌లో బుడమేరు కాల్వను పూడ్చి కబ్జాకు పాల్పడుతున్నారు. అర ఎకరం మేర కాల్వను పూడ్చివేసి పక్కా నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులమని బెదిరిస్తున్నారు. మరోచోట రామవరప్పాడు గ్రామం పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భూముల గిరాకీ పెంచుకునేందుకు అధికారుల అనుమతి లేకుండా బుడమేరు కాల్వపై ఏకంగా ప్రైవేటు వంతెనే నిర్మించేశారు. ఈయనగారు ఏకంగా తాను సీఎం పేషీ మనిషినని చెప్పుకుంటుండటం గమనార్హం.
బుడమేరు కాల్వ కృష్ణా జిల్లాలోని మైలవరంలో ప్రారంభమై 37 కిలోమీటర్ల మేర ప్రవహించి వెంట్రప్రగడ వద్ద కొల్లేరు సరస్సులో కలుస్తుంది. విజయవాడలో సుమారు 11 కిలోమీటర్ల మేర ఈ కాల్వ వెళుతోంది. ఈ కాల్వను ‘సారో ఆఫ్ విజయవాడ’ అని పిలుస్తారు. ఈ కాల్వ అధికశాతం కబ్జాలకు గురి కావడం.. కాల్వ కట్టలు ఎప్పుడో బలహీనపడిపోవడంతో ఏటా వర్షాకాలంలో బుడమేరు పొంగిపొర్లి నగరంలోని సగం ప్రాంతం ముంపునకు గురవుతోంది.
భవానీపురం, అజిత్‌సింగ్‌నగర్, అయోధ్యనగర్, పాయకాపురం, మధురానగర్, కనకదుర్గ నగర్ వంటి శివారు ప్రాంతాలు ముంపుబారిన పడేవి. బుడమేరు కాల్వ కట్టలను పటిష్ఠపరిచి ఆధునికీకరించేందుకు వీఎంసీ రూ.3 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే బుడమేరు కాల్వను ఎక్కడికక్కడ కబ్జారాయుళ్లు కబ్జా చేసేస్తూ పక్కా నిర్మాణాలు చేస్తుండటంతో మున్ముందు నగరానికి మరింత ముంపు ముప్పు పొంచి ఉంది.
సాఫీగా సాగాల్సిన నీటి ప్రవాహాలను కబ్జాలతో అడ్డుకుని, చెరువులను పూడ్చివేసి పక్కా భవనాలను నిర్మిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి 2015లో వచ్చిన చెన్నై వరదలే ప్రత్యక్ష నిదర్శనం. విజయవాడలోని శివారు ప్రాంతాల్లో పలు చెరువులు.. వాగులు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. బుడమేరు కాల్వ కూడా చాలా చోట్ల కబ్జాకు గురైంది. ఇప్పుడు ఏకంగా కాల్వ నామరూపాల్లేకుండా చేసేందుకు కబ్జారాయుళ్లు సిద్ధమయ్యారు.
అర ఎకరం పూడ్చి ప్లాట్లుగా..
అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలోని నందమూరి నగర్‌లో బుడమేరు కాల్వను కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు పూడ్చివేశారు. సుమారు అర ఎకరం మేర కాల్వను పూడ్చి ప్లాట్లుగా మార్చేశారు. వీటికి దొంగపత్రాలు సృష్టించి కొందరికి విక్రయిస్తున్నట్టు అగ్రిమెంట్లు చేసేశారు. అయితే నకిలీపత్రాలు కావడంతో కబ్జా ప్రాంతాన్ని రిజిస్టర్ చేయడం సాధ్యం కావడం లేదు. దీంతో ఆ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు అడ్వాన్సులు ఇచ్చిన వారికి కబ్జాదారులకు నడుమ గొడవలు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరుడినంటూ ఓ వ్యక్తి రంగప్రవేశం చేశాడు. ఆ అర ఎకరా స్థలాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ ప్రాంతంలో ఏకంగా పక్కా నిర్మాణాలే ప్రారంభించేశాడు. బుడమేరును కబ్జా చేసి కడుతున్న నిర్మాణాలను అడ్డుకోవాల్సిన వీఎంసీ అధికారులు అటువైపే చూడడం లేదు. ఈ పక్కా నిర్మాణాలను అడ్డుకోకపోతే మున్ముందు భవానీపురం, సింగ్‌నగర్ తదితర ప్రాంతవాసులకు ముంపు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
ఏకంగా వంతెనే కట్టేశాడు
విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు గ్రామం పరిధిలోని బుడమేరు కాల్వపై ఓ రియల్టర్ ఏకంగా వంతెనే కట్టేశాడు. ఏడాది క్రితం గుణదలలోని బుడమేరు కాల్వపై ఉన్న వంతెన కొంతభాగం కుంగిపోవడంతో దానికి అధికారులు మరమ్మతులు చేశారు. ఆ సమయంలో పోలవరం కాల్వ నిర్మాణానికి ఉపయోగించిన నాలుగు పెద్ద తూములను నీటిపారుదలశాఖ అధికారులు అక్కడికి తీసుకొచ్చారు. వాటిలో రెండింటినే ఉపయోగించారు. మిగిలిన రెండు తూములను రామవరప్పాడు రైతులు వాటిని కాల్వపై వేసుకుని కాలిబాటగా వాడుకుంటున్నారు.
బుడమేరు అవతల హనుమాన్‌నగర్‌లో ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. వాటికి గిరాకీ పెంచుకునేందుకు రైతుల కాలిబాట స్థానంలో ఏకంగా ప్రైవేటు వంతెనే నిర్మించేశాడు. సాధారణంగా వాగులు.. కాల్వలకు అడ్డంగా పక్కా నిర్మాణం చేపట్టినప్పుడు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ వంతెనపై నుంచి భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రి భారీగా తరలిస్తుండటంతో ఆ వంతెన ఏ క్షణంలోనైనా కూలే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. అదే జరిగితే భారీగా ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు.
ప్రైవేటుగా వంతెన నిర్మాణం ఒక ఎత్తయితే వంతెన నిర్మాణం చేపట్టిన ప్రదేశం నుంచి ఇన్నర్ రింగ్‌రోడ్డు వరకు 30 నుంచి 40 అడుగుల మేర మెటల్ రోడ్డును కూడా అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించేసుకున్నారు. కొందరు స్థానికులు ఇదేమని ప్రశ్నిస్తే తనకు ముఖ్యమంత్రి కోటరీలో పలుకుబడి ఉందని, జగన్‌కు సన్నిహితుడినని అందుకే అధికారులు ఎవరూ తనవైపు చూడరని బెదిరిస్తున్నారు. అధికారులు తక్షణం ఈ కబ్జాకాండపై దృష్టి సారించకపోతే బెజవాడ నగరానికి ముంపు బెడదతోపాటు ప్రజల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.