కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

ABN , First Publish Date - 2021-03-28T13:50:17+05:30 IST

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య కన్నుమూశారు.

కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

కడప : కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గున్ తోటి వెంకటసుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో సుబ్బయ్యను కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఎమ్మెల్యే కన్నుమూశారు.


ఆయన మృతి చెందారని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు, ద్వితియశ్రేణి నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే మృతిపట్ల జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన సేవలు చిరస్మరణీయమని ఆ పార్టీ నేతలు కొనియాడుతున్నారు. నియోజకవర్గ ప్రజలు సందర్శనార్థం ఆయన భౌతిక దేహాన్ని కడప నుంచి బద్వేలు తీసుకొస్తున్నారు. 2016లో బద్వేల్ వైసీపీ కో-ఆర్డినేటర్‌గా ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మొదటిసారి పోటీ చేసిన సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలిచారు.


ఈయన స్వస్థలం బద్వేల్ పురపాలకలోని మల్లెలవారిపల్లి దళితవాడ. ఈయన తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, పెంచల కొండమ్మ. ఈయనకు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మంచి వైద్యం అందించాలనే తపనతో తండ్రి.. తన కుమారుడు వెంకట సుబ్బయ్యను కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఎమ్మెస్‌తో వైద్యవిద్యను చదివించారు. చదువు పూర్తయిన తర్వాత ఈయన కామినేని, అపోలో ఆస్పత్రుల్లో పని చేశారు. సంధ్య అనే డాక్టర్ వివాహమాడి కడపలో లక్ష్మీ వెంకటేశ్వర క్లినిక్ ఆస్పత్రిని స్థాపించి వైద్య సేవలను ఆరంభించారు. ఈయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె ఇంటర్ చదువుతుండగా.. కుమారుడు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. రెండేళ్ల పాటు ప్రజలకు రాజకీయ సేవలు అందించారు. అనారోగ్య కారణంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.

Updated Date - 2021-03-28T13:50:17+05:30 IST