Sri Rama Navami: ఒంటిమిట్లలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 08:02 AM
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈనెల 11న సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తారు.

కడప: ఒంటిమిట్ట (Ontimitta) కోదండ రామాలయం (Kodanda Rama Temple)లో శ్రీరామనవమి (Sri Rama Navami) వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి. సీతారాములను దర్శించుకునేందుకు ప్రముఖులు, వేలాది మంది భక్తులు (Devotees) తరలివస్తున్నారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా కీలకఘట్టమైన ధ్వజారోహణకార్య క్రమం ఈరోజు ఉదయం 9 గంటలకు జరగనుంది. ఈనెల 15 వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11న సీతారాముల వారి కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీరామనవమి రోజున కళ్యాణంలేని ఏకైక ఆలయం ఒంటిమిట్ట కోదండ రామ స్వామి ఆలయమే. కాగా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో శోభాయాత్రకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. శోభాయాత్రలో డీజేలు, డ్రోన్స్‌పై నిషేధం విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు.
Also Read..: Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
శాస్త్రోక్తంగా అంకురార్పణ
కాగా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేదపండితులు విష్వక్సేనారాధన, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, కనకధారణ చేశారు. అనంతరం ఆగమ పండితులు రాజేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పుట్టమన్ను సేకరించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటే్‌షబాబు, భక్తులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్‌కుమార్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు నిర్వహించడానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలు, పూజా సామగ్రిని తీసుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హోమాల నిర్వహణకు యాగశాలలో హోమగుండాలు నిర్మించారు. రామాలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. జగదభిరాముడి కోవెల, మాడవీధులు, పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేశారు. వైద్యసేవలందించడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. వీఐపీలు, భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చారు. పోలీస్ బందోబస్తుకు ప్రత్యేక బలగాలను రప్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
ప్రతిరోజూ వాహనసేవలు...
ఉదయం 7.30 గంటల నుంచి 9.30, తిరిగి రాత్రి 7 గంటల 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. ఊళ్లో గ్రామోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. కోలాటం, తాళ భజనలు, డప్పుల దరువుతో ఊరేగింపు కోలాహలంగా సాగనుంది. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నెల 11న రాత్రి సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా అదికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
11న సీఎం చంద్రబాబు రాక..
శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు వచ్చారు. ఈనెల 11న సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో టీటీడీ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News