ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు రాక రోగుల ఇక్కట్లు
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:11 AM
జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జమ్మలమడుగు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు విధులకు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారని మరికొందరు డుమ్మా కొడుతున్నా రని ఆరోపణలున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారని పలువురు వాపోతున్నారు. కాగా బుధవారం ఉదయం 9 గంటలకు డాక్టర్లు విధులకు హాజరుకావాల్సి ఉండగా కొందరు ఉదయం 10 గంటలకుపైగా రాగా మరి కొందరు 11 గంటల మధ్య సమయంలో హాజరయ్యారని రోగులు ఆరోపిస్తున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ రఫిక్‌పాషాతోపాటు కొందరు డాక్టర్లు విదులకు ఉదయం 9 గంటలకే వస్తుండడం వలన కొంత ఇబ్బందులు లేకుండా రోగులకు వైద్య పరీక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ల కోసం రోగులు పడిగాపులు కాసి ఉన్నట్లుండి ఉదయం 10.30 గంటలకు ఇద్దరు డాక్టర్లు రాకతో ఒక్కసారిగా క్యూ కట్టారు. మరికొందరు ఇతర డాక్టర్లకోసం పడిగాపులు కాశారు. కాగా ఈ సమస్యపై సంబందించి ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రఫిక్‌పాషాను ‘ఆంధ్రజ్యోతి’ రోగుల సమస్యలు తెలిపి వివరణ కోరగా బుధవారం ఉదయం నుంచి 11 గంటల వరకు ఇద్దరు డాక్టర్లు మాత్రమే పనిచేశారన్నారు. మరో ముగ్గురు సదరం క్యాంపునకు వెళ్లారని, మరికొందరు సెలవులో ఉన్నారన్నారు. డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు.