ఆకట్టుకుంటున్న ఆద్యకళ ప్రదర్శన

ABN , First Publish Date - 2021-08-03T16:52:26+05:30 IST

ఎన్నో కళలు, ఆదివాసుల జీవనశైలిని ప్రతిబింబించే అనేకరకాల..

ఆకట్టుకుంటున్న ఆద్యకళ ప్రదర్శన

హైదరాబాద్ సిటీ/మాదాపూర్‌ : ఎన్నో కళలు, ఆదివాసుల జీవనశైలిని ప్రతిబింబించే అనేకరకాల చిత్రాలు, శాసనాలు, చరిత్ర సంపదలు భవిష్యత్‌ తరానికి నిలువుటద్దంగా నిలిచాయి. మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఆద్యకళ ఎగ్జిబిషన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు సేకరించిన అద్భుత కళాసంపదను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రపంచ నాగరికతకు సంబంధించిన అనేక శాసనాలు ప్రదర్శనలో కొలువుతీరాయి. ఇతర దేశాలకు చెందిన గిరిజన తెగకు సంబంధించిన సంగీత వాయిద్యాలు, వేల ఏళ్లనాటి శాసనాలు ఉన్నాయి. 


సారంగి వాయిద్యం : దీన్ని బంజారా తెగవారు వాయిస్తారు. బంజారాల ఉపతెగ బాన్స్‌ మాత్రం బరాబ్‌ అనే తంత్రి వాయిద్యం అంటారు. జానపదాల్లో సారంగి వాయిద్యం బాగా ఉపయోగపడేది. ప్రస్తుతం ఇది కనుమరుగైంది.


జానపద కిన్నెర : దీన్ని పూర్వకాలంలో గిరిజన తెగతోపాటు పలువురు ఉపయోగించేవారు. ప్రస్తుతం కనుమరుగైంది. తెలంగాణలో గొప్ప సంగీత వాయిద్యంగా ఉండేది. మహబూబ్‌నగర్‌, నల్లగొండ ప్రాంతాల్లో కిన్నెరను వాడేవారు. ముఖ్యంగా దీన్ని దళితులు మాత్రమే వాయించేవారు.  


తొటిబుర్ర వాయిద్యం : ఈ వాయిద్యాన్ని తొటిలనే కొర్రరాజులు వాయించేవారు. ఆదిలాబాద్‌లో గిరిజన తెగవాళ్లు ఎక్కువగా ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. తోళ్లు, ఎముకలపై ఎందరో మహానుభావులు రాసిన శాసనాలను భవిష్యత్‌ తరానికి అందజేయడం కోసం ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు బృందం సేకరించింది.

Updated Date - 2021-08-03T16:52:26+05:30 IST