thefts: రెచ్చిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:27 AM
thefts: మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.

- రోజుల వ్యవధిలోని ఏడుచోట్ల చోరీలు
- వాటి విలువ రూ.18 లక్షలు
కొత్తవలస, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా శనివారం రాత్రి దేశపాత్రునిపాలెం సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను చోరీ చేశారు. మండలంలో గత కొద్ది రోజుల వ్యవధిలోనే 7 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గుయ్యాయి. వీటి విలువ సుమారు రూ.18 లక్షల వరకు ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. చినరావుపల్లి, కంటకాపల్లి, పెదరావుపల్లి, కాటకాపల్లి, అప్పన్నదొరపాలెం, దేశపాత్రునిపాలెంలో ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైనట్టు ఆ గ్రామాల సర్పంచ్‌లు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామాలకు సంబంధించి రోడ్డుపక్కన ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల లక్ష్యంగా చోరీ చేస్తున్నట్టు విద్యుత్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. దొంగలు సులభంగా విద్యుత్ కనెక్షన్ తప్పించి, ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైరును వేరు చేసి పట్టుకెళ్లిపోతున్నారని చెబుతున్నారు. ఒక్కొక్క ట్రాన్స్‌ఫార్మర్ విలువ రూ.2.50లక్షలు ఉంటుందని అంటున్నారు. కొత్తవలస మండలంలోనే కాకుండా జామి, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో కూడా ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ జరిగినట్టు తమకు సమాచారం వచ్చిందని కొత్తవలస విద్యుత్ శాఖ ఏఈ అప్పారావు తెలిపారు. ప్రస్తుతం సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా తక్కువగా ఉందని, చోరీకి గురైన వాటి స్థానంలో కొత్తవి వేయడం ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ షణ్ముఖరావు తెలిపారు.