కేసీఆర్‌ది నాలుగేళ్ల పాలనే..
ABN , First Publish Date - 2021-07-07T05:12:20+05:30 IST
కేసీఆర్‌ది నాలుగేళ్ల పాలనే..

- కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలి: దామోదర రాజనర్సింహ
- రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు: ప్రసాద్‌కుమార్
- ధారూరులో విజయ సంకల్ప యాత్ర ప్రారంభం
ధారూరు : సీఎం కేసీఆర్ పదవిలో ఐదేళ్లు ఉండలేరని, పాలించే నాలుగేళ్లలో ‘రెండేళ్లు నేను తింటా.. రెండేళ్లు మీకు పంచుతా’ అనే సిద్ధాంతంతో పని చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించిన సందర్భంగా ధారూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ధారూరు నుంచి అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వరకు విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాంమోహన్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు రమేశ్ మహరాజ్‌లతో కలిసి దామోదర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు. దళితుల సాధికారతకు నిధులిస్తామంటున్న కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎందు కు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి రూ.72 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.15 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. 2014లో మిగులు బడ్జెట్‌తో ఉన్న ధనిక రాష్ట్రాన్ని 2021 నాటికి రూ.4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోపించారు.