డిస్కమ్‌లపై అప్పుల మోత
ABN , First Publish Date - 2022-10-28T02:44:52+05:30 IST
అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్)పై వైసీపీ సర్కారు మరింత భారం మోపుతోంది. జగనన్న ఇళ్ల కాలనీలకు విద్యుదీకరణ కోసం ..

జగనన్న కాలనీలకు విద్యుదీకరణ బాధ్యత వాటిదే
రూ.3,400 కోట్లు అప్పు చేసేందుకు ప్రయత్నం
పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీతో సంప్రదింపులు
ప్రభుత్వం భరించాల్సిన ఖర్చు విద్యుత్ సంస్థలపై
ఇప్పటికే డిస్కమ్‌లపై 38,000 కోట్ల రుణభారం
చివరకు అంతా వినియోగదారులపైనే: నిపుణులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్)పై వైసీపీ సర్కారు మరింత భారం మోపుతోంది. జగనన్న ఇళ్ల కాలనీలకు విద్యుదీకరణ కోసం డిస్కమ్‌లు అప్పుల వేటలో పడ్డాయి. ఇప్పటికే డిస్కమ్‌లకు దాదాపు రూ.38,000 కోట్ల రుణాలు ఉండగా, కొత్తగా మరో రూ.3400 కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమయ్యాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎ్‌ఫసీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ)లతో ఈ విషయంపై సంప్రదింపులు జరిపాయి. అప్పు ఇచ్చేందుకు అవి సూత్రప్రాయంగా అంగీకరించాయని డిస్కమ్‌లు వెల్లడించాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి కాకుండా... రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్న జగనన్న ఇళ్ల కాలనీలలో విద్యుత్ సరఫరా కోసం అప్పు చేయనుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి జగనన్న ఇళ్ల కాలనీల్లో విద్యుత్ సరఫరా, మురుగునీటి కాలువల నిర్మాణం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన భారమంతా ప్రభుత్వమే భరించాలి. వీటికయ్యే వ్యయాన్ని సంబంధిత శాఖలకు ప్రభుత్వమే ఇవ్వాలి.
విద్యుత్ సరఫరా చేయడానికి స్తంభాలు వేయడం, వైర్లు బిగించడం, వీధిలైట్లు, ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను డిస్కమ్‌లు తమ భుజాలకెత్తుకుని వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు ముందుకు వచ్చాయి. ఈ రుణం మంజూరైన వెంటనే రాష్ట్ర ఆర్థిక శాఖ తన ఖాతాలో వేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిస్కమ్‌ల అప్పులకు వడ్డీలు పెరిగి ఆ భారమంతా చివరకు వినియోగదారులపై పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రూఅప్ చార్జీల పేరిట చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరకొరగా చెల్లింపులు...
జగనన్న ఇళ్ల నిర్మాణాలకు విద్యుత్ లైన్లు వేసేందుకు గృహ నిర్మాణ సంస్థ డిస్కమ్‌లకు నిధులు ఇవ్వాల్సి ఉంది. కానీ నిధుల లేమితో గృహ నిర్మాణ సంస్థ డబ్బులు చెల్లించడం లేదు. ఎస్పీడీసీఎల్ పరిధిలో జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి విద్యుత్ లైన్లు వేసేందుకు రూ.78.93 కోట్లు ఇవ్వాలని గృహ నిర్మాణ సంస్థను ఆ సంస్థ కోరింది. అయితే ఇప్పటిదాకా రూ.2.61 కోట్లు మాత్రమే గృహ నిర్మాణ సంస్థ చెల్లించింది. అదేవిధంగా సీపీడీసీఎల్‌కు రూ.68.82 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... రూ.5.47 కోట్లు మాత్రమే చెల్లించింది.
ఇక ఈసీడీసీఎల్‌కు గృహ నిర్మాణ సంస్థ రూ.69.78 కోట్లు చెల్లించాల్సి ఉండగా... కేవలం రూ.86 లక్షలతో సరిపెట్టింది. ప్రైవేటు లేఅవుట్‌లకు విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చేందుకు డెవలపర్లే ముందుగా ఫీజులు చెల్లిస్తారు. కానీ ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల కోసం డిస్కమ్‌లు భారీస్థాయిలో అప్పులు చేసేందుకు సిద్ధంకావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నుంచి డిస్కమ్‌లు ఆమోదం తీసుకున్నాయా అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం ప్రత్యేకంగా రుణాలు తీసుకుని, ఆ భారాన్ని వినియోగదారులపై వేసేందుకు డిస్కమ్‌లు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.