Street Dog Attack: ఓ శునకమా.. ఎంత పని చేశావ్.. కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబం..
ABN , Publish Date - Apr 06 , 2025 | 09:28 PM
గుంటూరులో ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఆపేందుకు ఎవ్వరూ లేకపోవడంతో తీవ్రంగా గాయపరిచింది.

గుంటూరు: నగరంలో వీధి కుక్కలు విజృంభించాయి. నాలుగేళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేసి ప్రాణాలు తీసేశాయి. గుంటూరు స్వర్ణ భారతి నగర్(Guntur Swarna Bharathi Nagar)కు చెందిన నాగరాజు, రాణి(Nagaraju and Rani) దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు ఐజాక్(Isaac)తో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాణి ఇంట్లో పని చేస్తుండగా.. నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లారు. బాలుడు ఐజాక్ ఇంటి ఎదుట ఒంటరిగా ఆడుకుంటున్నాడు.
అయితే చిన్నారి వద్దకు వచ్చిన ఓ శునకం దాడి చేయడం మెుదలుపెట్టింది. ఆపేందుకు చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో బాలుడిని విపరీతంగా కరిచింది. దీంతో ఐజాక్ ముఖం, కాళ్లు, చేతులు, పొట్ట భాగాలపై విపరీతంగా గాయాలు అయ్యాయి. కాసేపటికి చిన్నారి కేకలు విన్న తల్లి రాణి ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టింది. తన కుమారుడిని శునకం కిందపడేసి కరుస్తున్న దృశ్యాలు చూసి చలించిపోయింది. వెంటనే అక్కడున్న కర్ర తీసుకుని కుక్కను తరిమేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెపైనా దాడి చేసేందుకు యత్నించింది ఆ శునకం. రాణి కేకలు విన్న చుట్టుపక్కల ఇళ్లవారు వెంటనే బయటకు వచ్చి కుక్కను తరిమేశారు.
బాలుడు ఐజాక్‌ను హుటాహుటిన గుంటూరు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి నాగరాజు సైతం ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే కుక్క దాడిలో తీవ్రంగా గాయపడడంతో ఐజాక్ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మృతితో నాగరాజు, రాణి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదించారు. దీంతో ఆస్పత్రి ఆవరణలోనే రాణి సొమ్మసిల్లి పడిపోయింది. వారి పరిస్థితిని చూసిన స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఆ రైతుల కోసం కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. అమెరికాతో చర్చలు జరపాలంటూ..
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్