హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
ABN , First Publish Date - 2022-09-02T05:25:05+05:30 IST
నరసరావుపేటలో రాజకీయాలు విగ్రహాల చుట్టూతిరుగుతున్నాయి.

వైఎస్‌ఆర్ విగ్రహంపై చర్యలు శూన్యం
ధిక్కార పిటిషన్ దాఖలకు పిటిషనర్ సిద్ధం
పల్నాడురోడ్డులో ఇష్టారాజ్యంగా విగ్రహాల ఏర్పాటు
చట్టాలు, కోర్టు తీర్పులను పట్టించుకోని యంత్రాంగం
నరసరావుపేట, సెప్టెంబరు 1: నరసరావుపేటలో రాజకీయాలు విగ్రహాల చుట్టూతిరుగుతున్నాయి. పట్టణంలో ఇష్టారాజ్యంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నా.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. అనధికారిక విగ్రహాలపై చర్యలు తీసుకోవాలని ఏకంగా హైకోర్టు ఆదేశించినా అధికారుల్లో చలనం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పల్నాడు రోడ్డులో ఏర్పాటు చేస్తున్న వైఎస్‌ఆర్ విగ్రహంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో శేఖర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు అనధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శిని మంగళవారం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సదరు అధికారులు అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. కోర్టు ఆదేశించిన అనంతరం కూడా విగ్రహానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయంటే అధికారుల ఎంతటి నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. చట్టాలు, కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ చెప్పిందే చట్టంగా వారు విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పల్నాడు రోడ్డులోని డివైడర్‌లో ఎక్కడపడితే అక్కడ అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలకు అనుమతులు ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోకుండా ప్రజాప్రతినిధులు ఆవిష్కరిస్తున్నారు. చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే చట్టాలను ఉల్లంఘిస్తుండటంపై విమర్శలు వెల్లుత్తుతున్నాయి.
నిబంధనలపై నిర్లక్ష్యం..
రహదారుల్లో విగ్రహల ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ప్రభుత్వ జీవోల ప్రకారం నిబంధనలను అమలు చేయడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారు. డివైడర్‌లో విగ్రహాలను ఆవిష్కరిస్తున్నా అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరించింది. దీంతో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఏర్పాటయ్యాయి. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విషయంలో కలెక్టర్ అధ్యక్షతన ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ సమావేశమైనట్లు సమాచారం. వైఎస్‌ఆర్ విగ్రహంపై చర్యలతో పాటు ఇతర విగ్రహాల విషయంలో చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. వైఎస్ విగ్రహంపై చర్యలు తీసుకునే ముందు మిగతా వాటి విషయంలో చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గురువారం రాత్రి వరకు వైఎస్‌ఆర్ విగ్రహంపై కోర్టు ఆదేశాలు అమలు కాలేదు. వైఎస్ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్న ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేస్తారా? అధికార పార్టీ ఆదేశాలను అమలు చేస్తారో చూడాలి.