Donald Trump: మోదీ నా స్నేహితుడే కానీ.. ప్రతీకార సుంకాలపై ట్రంప్
ABN , Publish Date - Apr 03 , 2025 | 07:20 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాలు విధించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయంతో అమెరికా సుసంపన్నమవుతుందని.. మళ్లీ పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. అలానే భారత్ తమకు మిత్రుడే కానీ.. సుంకాల విషయంలో ఆ దేశం వైఖరి సరిగా లేదని ట్రంప్ ఆరోపించాడు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రంపంచ దేశాలకు షాకిచ్చాడు. గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తూ వస్తోన్నలిబరేషన్ డే.. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 2 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక భారత్‌పై ప్రతికారం సుంకాలు ఎంత విధించారో వెల్లడించారు. ప్రధాని మోదీ తమకు స్నేహితుడే అని స్పష్టం చేసిన ట్రంప్.. సుంకాల విధింపు విషయంలో మాత్రం.. ఇండియా.. అమెరికాతో సరిగా ప్రవర్తించడం లేదని.. అమెరికా వస్తువులపై భారత్ ఏకంగా.. 52 శాతం సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాక ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో.. కేవలం సగం మాత్రమే తాము విధించబోతున్నట్లు ప్రకటించారు. భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. "నేడు అమెరికాకు పునర్జన్మ.. చాలా ఏళ్లుగా మన దేశాన్ని మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇకపై అది జరగదు. మాపై భారీగా సుంకాలు విధించే దేశాలపై మేం కూడా తప్పకుండా ప్రతీకార సుంకాలు విధిస్తాం" అని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాక ప్రతీకార సుంకాలు విధించడానికి గల కారణాలను కూడా ట్రంప్ వివరించారు.
"అమెరికా భవిష్యత్తు అమెరికన్ పౌరుల్ల చేతుల్లోనే ఉంది.. ఇతర దేశాలు మా దేశంపై విధిస్తున్న సుంకాల్లో సగం మాత్రమే మేం విధిస్తున్నాం.. ఆయా దేశాలపై దయతోనే మేము ఇలా చేశాం.. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాం.. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా పారిశ్రామిక రంగానికి ఈరోజు పునర్జన్మ లభించినట్లు అయ్యింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా నేడు (ఏప్రిల్ 2) ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
తమ టాక్స్ పేయర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారు... ఇక అది జరగదని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాక అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని దొంగిలించాయని.. పలు దేశాలు అన్యాయమైన విధానాలను అవలంభించాయని ట్రంప్ ఆరోపించారు. అమెరికా దిగుమతి చేసుకున్న మోటారు సైకిళ్లపై 2.4 శాతం సుంకాలు విధిస్తోండగా.. థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న టూవీర్లపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు.
తాను ప్రతీకార సుంకాల ప్రతిపాదన తీసుకువచ్చిన తర్వాత.. అనేక దేశాల పాలకులు, రాయబారులు ఈ అంశంపై స్పందించారని.. సుంకాలపై మినహాయింపులు కోరారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఆయా దేశాలు సుంకాలు తగ్గిస్తేనే తాను తగ్గిస్తానని చెప్పానని ట్రంప్ స్పష్టం చేశారు. కరెన్సీని మార్చుకోవద్దని, బిలియన్ డాలర్ల అమెరికా వస్తువులను కొనాలని చెప్పానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
అమెరికా సహా అతలాకుతలమౌతోన్న ప్రపంచ మార్కెట్లు