Polavaram : పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం!

ABN , First Publish Date - 2022-11-08T04:35:02+05:30 IST

ప్రాజెక్టు ప్రాంతంలో గోదావరి జలాలు తగ్గితే తప్ప పోలవరం పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తామో చెప్పలేమని కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది.

Polavaram : పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం!
Polavaram project

వరద తగ్గాకే సమాంతరంగా పనులు

జల సంఘానికి రాష్ట్రం స్పష్టీకరణ

రేపు ముంపు ప్రాంతాల్లో ఉమ్మడి సర్వే

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టు ప్రాంతంలో గోదావరి జలాలు తగ్గితే తప్ప పోలవరం పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తామో చెప్పలేమని కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో జల సంఘం బృందం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించిన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకరబాబు సహా సూపరింటెండింగ్‌ ఇంజనీర్లతో కేంద్ర జల సంఘం అధికారులు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేస్తారో వివరించే కార్యాచరణను అందజేయాలని జలసంఘ కోరింది. నీటిని తోడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆరా తీసింది. కాఫర్‌ డ్యాం వద్ద ఇప్పటికీ 15 మీటర్లకు పైగా వరద నీరు ఉందని.. ఈ నిల్వ 14 మీటర్ల కంటే దిగువకు వెళ్లాక.. నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ వెల్లడించింది.

నీటిని తోడేశాక దిగువ కాఫర్‌ డ్యాం ఎత్తు పెంపు చేపడతామని తెలిపింది. వరద జలాలు పూర్తిగా తగ్గాక.. జలసంఘం సూచనల మేరకు జెట్‌ గ్రౌటింగ్‌ విధానం ద్వారా గుంతలను పూడ్చివేస్తామని వివరించింది. డయాఫ్రం వాల్‌కు గ్రౌటింగ్‌ను నిర్వహించాక హెచ్‌పీసీఎల్‌ బృందం అధ్యయనం చేసి నివేదికను ఇస్తుందని వెల్లడించింది. ప్రాజెక్టులో మిగిలిన అన్ని పనులనూ సమాంతరంగా చేపడతామని.. దీనివల్ల సమయం కలిసి వస్తుందని పేర్కొంది. కాగా.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ఏపీ, తెలంగాణతో కలసి కేంద్ర జల సంఘం బుధవారం నుంచి సంయుక్త సర్వే చేపట్టనుంది. సర్వే తర్వాత కొత్తగా భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలపై జలసంఘం ఒక నిర్ణయానికి వస్తుంది.

Updated Date - 2022-11-08T04:35:07+05:30 IST