Ambati Rambabu: అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-12-30T21:03:17+05:30 IST
సంక్రాంతి సంబరాలు, ముగ్గుల లక్కీ డ్రా పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో లక్కీ డ్రా కూపన్లు విక్రయింపచేస్తున్న మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)పై చర్యలు...
సత్తెనపల్లి: సంక్రాంతి సంబరాలు, ముగ్గుల లక్కీ డ్రా పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో లక్కీ డ్రా కూపన్లు విక్రయింపచేస్తున్న మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)పై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sattenapalle) పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ డీప్ పేరుతో ప్రజలను వైసీపీ (YCP) నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, డీలర్లు తదితరుల చేత లక్కీ డ్రా కూపన్లు అంటగడుతున్నారని తప్పుబట్టారు. ఒక్కో కూపను రూపాయ చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. లక్కీ డ్రా గెలుపొందిన వారికి బంగారపు వస్తువులు, ట్రాక్టర్లు, కార్లు, ఎల్‌ఈడీ టీవీలు, మిక్సీలు అందిస్తామని ఇప్పటికే కరపత్రాలు పంపిణీ చేశారన్నారు. లక్కీ డ్రాలు అనేవి చట్ట విరుద్ధమన్నారు. లక్కీ డ్రా కూపన్లు విక్రయిస్తున్న వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని, కారకుడైన మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.