మూడో రోజూ ఆగిన సీబీజీ ప్లాంట్ పనులు
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:30 PM
రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ పనులు వరుసగా మూడోరోజూ నిలిచిపోయాయి. సంస్థకు కేటాయించిన భూమి విషయమై రెవెన్యూ, అటవీశాఖల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాకపోవడమే ఇందుకు కారణమైంది. కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటుకు 799.40 ఎకరాలు కేటాయించారు.

అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
నేడు ఆర్డీవోతో చర్చలు
కురిచేడు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ పనులు వరుసగా మూడోరోజూ నిలిచిపోయాయి. సంస్థకు కేటాయించిన భూమి విషయమై రెవెన్యూ, అటవీశాఖల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాకపోవడమే ఇందుకు కారణమైంది. కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటుకు 799.40 ఎకరాలు కేటాయించారు. ఇందులో ఉన్న చెట్లను రిలయన్స్ సంస్థ ఎక్స్‌కవేటర్లతో తొలగించే పనులు చేపట్టింది. ఈక్రమంలో అటవీ అధికారులు రంగప్రవేశం చేశారు. సదరు భూమ తమ శాఖదంటూ పనులు నిలిపివేయించారు. సోమవారం జిల్లా అటవీ శాఖాధికారి కలెక్టర్‌ను కలిశారు. మంగళవారం కనిగిరి ఆర్డీవోతో చర్చించాలని కలెక్టర్ డీఎఫ్‌వోకు సూచించారు.
కొలతలు వేసిన అటవీశాఖ అధికారులు
గంగదొనకొండలో 88, 90 సర్వే నంబర్లలో 799.40 ఎకరాల భూమిని సీబీజీ ప్లాంట్‌కు కేటాయించారు. దీంతో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు పనులు ప్రారంభించారు. యంత్రాలతో భూమిలోని చెట్లను తొలగించి చదును చేసే పనులను చేపట్టారు. ఈనేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రంగ ప్రవేశం చేశారు. ఆ భూమి తమదంటూ శనివారం పనులను అడ్డుకున్నారు. సోమవారం సైతం అటవీ శాఖాధికారులు పెద్దసంఖ్యలో వచ్చి కొలతలు వేసే పని చేపట్టారు. జీపీఎస్ ద్వారా జియో ట్యాగింగ్ చేశారు. ఆ వివరాలను జిల్లా అటవీ శాఖాధికారికి పంపగా ఆయన కలెక్టర్ అన్సారియాను కలిసి వివరించారు. ఆమె మంగళవారం కనిగిరి ఆర్డీవోను కలిసి చర్చించాలని సూచించారు. దీంతో రెండు రోజులుగా పనులు నిలిచిపోయాయి. మంగళవారం ఆర్డీవోతో సమావేశం తరువాత సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పనులు ఆలస్యమవుతుండటంతో ఎక్స్‌కవేటర్ల యజమానులు యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
భూమి తమదే అంటున్న రెవెన్యూ అధికారులు
రెవెన్యూ అధికారులు మాత్రం ఆ భూమి పూర్తిగా తమదేనని అంటున్నారు. ఎఫ్‌ఎల్‌ఆర్‌లో గయాలు అని ఉందంటున్నారు. అలాంటి భూమిని అటవీ శాఖాధికారులు వారిది అని ఎలా అంటున్నారో అర్థంకావడం లేదన్నారు. వారి వద్ద ఉన్న రికార్డులు తీసుకురావాలని కోరుతున్నారు. పెద్ద పరిశ్రమ వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సమయంలో అడ్డుకోవడం ఏమిటని అటవీ శాఖాధికారులను ప్రశ్నిస్తున్నారు. సోమవారం సీబీజీ ప్లాంట్ వద్దకు వచ్చిన అటవీ శాఖాఽధికారులలో ఒంగోలు రేంజ్ ఆఫీసర్ బి.నరసింహారావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కేబీ నాయక్, బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అచ్చిరెడ్డి ఉన్నారు.