Share News

no clarity.. ఆరు నెలలైనా తేలలే..

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:34 PM

Even after six months, no clarity.. సీతంపేటలో నిర్మిస్తున్న గిరిజన మ్యూజియంలో విలువైన వస్తువులు చోరీకి గురై నెలలు గడిచినా.. ఇంతవరకు కేసులో ఎటువంటి పురోగతి లేదు. మాయమైన ఏసీ ఔటర్‌ యూనిట్లు, సీలింగ్‌ యూనిట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. వాటి విలువ సుమారు రూ.పది లక్షల వరకూ ఉండగా.. దర్యాప్తు మాత్రం నత్తనడకన సాగుతోంది.

 no clarity.. ఆరు నెలలైనా తేలలే..
సీతంపేటలో గిరిజన మ్యూజియం భవనం

  • నేటికీ దొరకని ఏసీ యూనిట్లు, సీలింగ్‌ లైట్లు

  • పురోగతి లేని చోరీ కేసు దర్యాప్తు

  • పట్టించుకోని ఐటీడీఏ అధికారులు

  • మండిపడుతున్న గిరిజన సంఘాలు

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): సీతంపేటలో నిర్మిస్తున్న గిరిజన మ్యూజియంలో విలువైన వస్తువులు చోరీకి గురై నెలలు గడిచినా.. ఇంతవరకు కేసులో ఎటువంటి పురోగతి లేదు. మాయమైన ఏసీ ఔటర్‌ యూనిట్లు, సీలింగ్‌ యూనిట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. వాటి విలువ సుమారు రూ.పది లక్షల వరకూ ఉండగా.. దర్యాప్తు మాత్రం నత్తనడకన సాగుతోంది. దీనిపై ఐటీడీఏ అధికారులు కూడా పట్టించుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యాటక ప్రాంతాల అభివృద్థిలో భాగంగా 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సీతంపేట పీఎంఆర్‌సీలో రూ.కోటితో గిరిజన మ్యూజియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటి ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2019లో పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం గిరిజన మ్యూజియం నిర్మాణంపై అంతగా దృష్టి సారించలేదు. దీంతో గత ఐదేళ్లుగా మ్యూజియం పనులు నత్తనడకనే సాగాయి. కనీసం 50శాతం నిర్మాణం కూడా పూర్తవలేదు. మరోవైపు నిధుల లేమి కారణంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

కూటమి ప్రభుత్వం గిరిజన మ్యూజియం నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా సీతంపేట ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌తో పాటు గిరిజన మ్యూజియం కోసం రూ.2.5 కోట్లు మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రూ.కోటితో గిరిజన మ్యూజియం పనులు పూర్తి చేసేందుకు ఐటీడీఏ అధికారులు సిద్ధమవుతున్నారు.

గత ఏడాదిలో..

గత ఏడాది అక్టోబరులో మ్యూజియంలో విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. మ్యూజియంలో 20 ఏసీలను అమర్చగా.. భవనం చుట్టూ ఉన్న 14 ఔటర్‌ యూనిట్లు కనిపించకుండా పోయాయి. మూడు సీలింగ్‌ లైట్లు కూడా మాయమయ్యాయి. ఈ విషయాన్ని అప్పట్లో ఆలస్యంగా గుర్తించిన మ్యూజియం క్యూరేటర్‌ ఐటీడీఏ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ వై.అమ్మన్నరావు సిబ్బంది గిరిజన మ్యూజి యాన్ని సందర్శించి చోరికి గురైన వస్తువులు వివరాలను సేకరించారు. దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నేటికి ఆరు నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు.

- చోరీ ఘటన తర్వాత పీఎంఆర్‌సీ గెస్ట్‌హౌస్‌లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

- గెస్ట్‌హౌస్‌కు పక్కనే ఉన్న గిరిజన మ్యూజియం వద్ద మాత్రం ఎటువంటి భద్రత చర్యలు తీసుకోలేదు. పైగా మ్యూజియంలో ఏర్పాటు కోసం ఆదివాసీల నుంచి సేకరించిన విలువైన వస్తువులను సరిగ్గా భద్రపరచలేదు. ఓ స్టోర్‌ రూంలో చిందర వందరగా పడేశారు. వాటిల్లో కొన్ని విరిగిపోయి ఆనవాళ్లు లేకుండా పోయాయి.

- నిరంతర పర్యవేక్షణకు రెగ్యులర్‌ సిబ్బందిని నియమించకపోవడం, ఉన్న సిబ్బంది అందుబాటులో లేకపోవడం మూలంగానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్లు గిరిజన సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

- దీనిపై ఎస్‌ఐ వై.అమ్మన్నరావును వివరణ కోరగా.. ‘పీఎంఆర్‌సీలోని గిరిజన మ్యూజియంలో జరిగిన చోరీపై దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం.’ అని తెలిపారు.

Updated Date - Apr 07 , 2025 | 11:34 PM