Share News

Aqwa: ఆక్వాకు కష్టకాలం

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:36 PM

Aqua industry Struggles మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది జిల్లాలో ఆక్వా పరిస్థితి. వైసీపీ పాలనలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. గత ఐదేళ్లు ఎటువంటి ప్రోత్సాహం లేకపోగా.. విద్యుత్‌ చార్జీలు, ఇతరత్రా పన్నుల భారంతో పూర్తిగా కుదేలైంది. చాలామంది ఆక్వా రంగాన్ని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు. ఫలితంగా ఆక్వా పరిశ్రమపై ఆధారపడిన వేలాదిమంది ఉపాధికి దూరమయ్యారు.

Aqwa: ఆక్వాకు కష్టకాలం
బుడగట్లపాలెంలో రొయ్యల చెరువు సాగు

  • జిల్లాలో రొయ్యకు అమెరికా సుంకాల సెగ

  • 4 శాతం ఉన్నది 27 శాతానికి పెంపు

  • ఆందోళనలో నిర్వాహకులు, మత్స్యకారులు

  • - రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన బసవ గోవిందరెడ్డి గతంలో 25 ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగుచేసేవారు. కానీ గత వైసీపీ పాలనలో విద్యుత్‌ రాయితీ, ఆక్వా రంగానికి ప్రోత్సాహం లేక రొయ్యల చెరువుల సాగును నిలిపివేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రాయితీతోపాటు ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించడంతో చెరువుల సాగుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అమెరికాలో పన్నుల మోతతో రొయ్య ధర తగ్గుముఖం పట్టింది. దీంతో చెరువుల సాగు విషయంలో పునరాలోచనలో పడ్డారు.

  • ....................

  • రణస్థలం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది జిల్లాలో ఆక్వా పరిస్థితి. వైసీపీ పాలనలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. గత ఐదేళ్లు ఎటువంటి ప్రోత్సాహం లేకపోగా.. విద్యుత్‌ చార్జీలు, ఇతరత్రా పన్నుల భారంతో పూర్తిగా కుదేలైంది. చాలామంది ఆక్వా రంగాన్ని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు. ఫలితంగా ఆక్వా పరిశ్రమపై ఆధారపడిన వేలాదిమంది ఉపాధికి దూరమయ్యారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ రాయితీలు, ఆహార ఉత్పత్తుల ప్రోత్సాహంలో భాగంగా ఊతమిచ్చే చర్యలు ప్రారంభమయ్యాయి. కానీ ఇంతలోనే అగ్రరాజ్యం అమెరికాలో ప్రతీకార సుంకాలు మొదలయ్యాయి. దీంతో మన జిల్లా నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై కూడా పన్ను భారం పెరిగింది. దీనికి రవాణా, ఇతరత్రా చార్జీలు అదనం కానున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో రొయ్య ధర తగ్గించుకోవాల్సి వస్తోంది. దాని ప్రభావం ఆక్వాపై పడుతుందని రైతులతో పాటు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

  • ఇదీ పరిస్థితి..

  • జిల్లాలో 11 తీరప్రాంత మండలాల్లో 4వేల హెక్టార్లలో ఆక్వా సాగవుతోంది. రణస్థలం, ఎచ్చెర్ల, గార, సంతబొమ్మాళి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పోలాకి మండలాల్లో ఆక్వాలో భాగంగా అధికంగా చేపల చెరువులు సాగు చేస్తున్నారు. సుమారు 1500 మంది నిర్వాహకులు చేపల చెరువులు సాగు చేయగా.. వాటిలో 10వేల మంది వరకూ పనిచేస్తున్నారు. ఏడాదికి రూ.200కోట్ల మేర క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఎక్కువగా అమెరికాకు ఎగుమతయ్యే రొయ్య ఇక్కడ సాగవుతోంది. ఇక్కడ నుంచి రొయ్యలను వ్యాపారులు సేకరించి విశాఖ పోర్టు నుంచి ఎగుమతి చేసేవారు. ఇప్పటివరకూ అమెరికాలో రొయ్యలపై 3 నుంచి 4 శాతం సుంకం మాత్రమే విధించేవారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. సుంకాలపై నిర్ణయంలో భాగంగా ఏకంగా 27 శాతానికి పెంచనున్న నేపథ్యంలో ధర అమాంతం పెరగనుంది. దాని ప్రభావంతో జిల్లా రైతులు ధర తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పరిణామంతో జిల్లాలో రొయ్యల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఆక్వా నిర్వాహకులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

  • పన్నులకే సగం..

  • కొత్త సుంకాలు అమల్లోకి వస్తే రూ.లక్ష విలువ చేసే రొయ్యలు అమెరికాకు ఎగుమతి చేయాలంటే రూ.27వేలు పన్ను కట్టాల్సి ఉంటుంది. రవాణా, ప్యాకింగ్‌, ఇతరత్రా ఖర్చులతో కలిపి 50శాతం ధర పెరగడం ఖాయం. అందుకే రైతుల నుంచి సేకరించి అమెరికాకు రొయ్యలు తరలిస్తున్న వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. రొయ్యల ధర తగ్గిస్తున్నారు. చేసిందేమీ లేక రైతులు కూడా తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. ఇలా అయితే నిర్వహణ కష్టమేనని ఆక్వా రైతులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట వరకూ 100 కౌంట్‌ ధర రూ.230 ఉంది. తాజా పరిణామాలతో ఉన్నఫలంగా రూ.40 తగ్గించారు. ఈ ధర మరింత తగ్గనుందని చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో రొయ్యల ఎగుమతిదారులు సమావేశమయ్యారు. అమెరికా సుంకాల ప్రభావం ఎంతలా ఉంటుంది? పెంచితే రొయ్యల ధర ఎంత తగ్గించాలి? ఏ విధంగా కొనుగోలు చేయాలి? అనే అంశాలపై చర్చించారు. సుంకం పెరిగితే జిల్లాలో ఆక్వా సాగు పడిపోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • వైసీపీ పాలనలో కుదేలు..

  • వైసీపీ పాలనలో ఆక్వారంగానికి ఎటువంటి ప్రోత్సాహం లేదు. పెరిగిన మేతలు, మందుల ధరలు, లీజు వ్యవహారాలతో ఆక్వారంగం మరింత నీరసించిపోయింది. ఆక్వా జోన్ల సమస్య, విద్యుత్‌ ధరలతో ఏకంగా కుదేలైంది. జగన్‌ రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేకపోయారు. ఈ-షిప్‌ విధానంలో అనేక నిబంధనలను తెరపైకి తెచ్చారు. టీడీపీ హయాంలో వంద రొయ్యల ధర రూ.250 నుంచి రూ.260 వరకూ ఉండేది. కానీ వైసీపీ హయాంలో రూ.180కు పడిపోయింది. ఉప్పు, మంచినీరు ఆక్వా జోన్లుగా విభజించారు. పది ఎకరాల్లోపు సాగుచేసిన రైతులకు మాత్రమే రూ.1.50కు యూనిట్‌ విద్యుత్‌ను అందించారు. దీంతో జిల్లాలో వందలాది మంది ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీ అందలేదు. పది హార్స్‌ పవర్‌ విద్యుత్‌ మోటారును వినియోగించేవారికి రాయితీ వర్తించదని.. ఈ-షిప్‌ విధానంలో చెరువుల లీజు ఒప్పందం, లైసెన్స్‌, విద్యుత్‌ మీటరు, భూమి ఆన్‌లైన్‌ పత్రాలు ఇవ్వాలని మెలిక పెట్టారు. వీటిలో ఏ ఒక్కటీ లేకపోయినా యూనిట్‌ విద్యుత్‌కు రూ.6వరకూ కట్టాల్సి వచ్చేది. దీంతో రూ.లక్షల్లో విద్యుత్‌ బిల్లులు చెల్లించిన చాలామంది చెరువుల సాగును నిలిపివేశారు.

  • కూటమి సానుకూల నిర్ణయం..

  • తాజాగా కూటమి ప్రభుత్వం చెరువులు సాగుచేసే వారికి రాయితీ విద్యుత్‌ అందించాలని నిర్ణయించింది. రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ను అందించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. 2014-2019 మధ్య కూడా చంద్రబాబు సర్కారు రూ.2కే యూనిట్‌ విద్యుత్‌ అందించడంతో ఆక్వా నిర్వాహకులు ఇంజన్లను తొలగించి మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే ఎటువంటి నిబంధనలు లేకుండా అందించేందుకు సిద్ధపడిన తరుణంలో జిల్లాలో వందలాది మంది ఆక్వా నిర్వాహకులు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. కానీ ట్రంప్‌ సుంకాల గండం వెంటాడడంతో మరోసారి ఆక్వా రంగం ఉనికికి ప్రమాదం ఏర్పడుతోంది. అందుకే దేశీయంగానే రొయ్యకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని జిల్లాలో ఆక్వా రైతులు, కార్మికులు, మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • దెబ్బతిన్న ఆక్వా రంగం..

    ఆక్వా రంగం దారుణంగా దెబ్బతింది. గత ఐదేళ్లలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. కూటమి ప్రభుత్వం విద్యుత్‌ రాయితీ ప్రకటించింది. ఆహార ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించడం శుభ పరిణామం. కానీ అమెరికాలో సుంకాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా రొయ్యల విక్రయాలు నిలిచిపోయాయి. ఇది ఆందోళన కలిగించే విషయం.

    - దుమ్మ అశోక్‌, మత్స్యకార ప్రతినిధి, జీరుపాలెం

    .........................

  • దేశీయంగా మార్కెట్‌ కల్పించాలి

    జిల్లాలో 11 మండలాల్లో చేపల చెరువులు సాగుచేస్తున్నారు. ఇందులో మత్స్యకారులే అధికం. తీరంలో వేట గిట్టుబాటు కావడం లేదు. చేపల చెరువులతో ఉపాధి పొందేందుకు అవకాశం లేకుండా పోతోంది. అందుకే ఆక్వా ఉత్పత్తులకు దేశీయంగా మార్కెట్‌ కల్పించాలి. ప్రభుత్వమే గిట్టుబాటు ధరను ప్రకటించాలి.

    - ఆర్‌.వాసుదేవరావు, ఆక్వా రైతు

Updated Date - Apr 07 , 2025 | 11:36 PM