Rishi sunak: ప్రధానిగా రిషి.. వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ కమెడియన్ వివరణ
ABN , First Publish Date - 2022-10-29T20:00:16+05:30 IST
బ్రిటన్ ప్రజలంతా జాత్యాహంకారం కలవారని తానెప్పుడూ అనలేదని ప్రముఖ కమెడియన్, టీవీ షో వ్యాఖ్యాత ట్రెవర్ నోవా తాజాగా వివరణ ఇచ్చారు.
వాషింగ్టన్: బ్రిటన్ ప్రజలంతా జాత్యాహంకారం కలవారని తానెప్పుడూ అనలేదని ప్రముఖ కమెడియన్, టీవీ షో వ్యాఖ్యాత ట్రెవర్ నోవా(Trevor Noah) తాజాగా వివరణ ఇచ్చారు. యూకే ప్రధానిగా రిషి సునాక్(Rishi Sunak) ఎన్నికైన నేపథ్యంలో ట్రెవర్ నోవా తన టీవీ షోలో పలు వ్యాఖ్యలు చేశారు. ఓ శ్వేతజాతీయేతరుడు బ్రిటన్ అధికార పీఠాన్ని అధిరోహించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నాని మాత్రమే కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో బ్రిటన్ రాజకీయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రముఖ నాయకులు ఆయన కామెంట్స్‌ను ఖండించారు. బ్రిటన్(UK) ఓ జాత్యాహంకార దేశంగా చూపించారంటూ ఆ దేశానికి చెందిన మరో టీవీ షో వ్యాఖ్యాత పియర్స్ మార్గన్ అభ్యంతరం తెలిపారు. ట్రెవర్ నోవా వ్యాఖ్యలు తప్పని బ్రిటన్ మాజీ కేబినెట్ మంత్రి, పాకిస్థానీ సంతతికి చెందిన సాజిద్ జావేద్(Sajid Javed) ట్వీట్ చేశారు.
తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ట్రెవర్ నోవా తాజాగా స్పందించారు. బ్రిటన్ జాత్యాహంకారపూరిత దేశమని తానెప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. కొందరు మాత్రమే రిషి ప్రధాని అవడాన్ని తట్టుకోలేకపోయారని తాను వీడియోలో అన్న విషయం స్పష్టంగానే కనిపిస్తోందని చెప్పారు. ఆ షోలో ట్రెవర్ మాట్లాడుతూ.. ‘‘రిషి సునాక్ ప్రధాని కావడంతో కొందరు భయపడుతున్నారు, గతంలో ఇతర దేశాల పట్ల బ్రిటన్ వ్యవహరించినట్లుగానే రిషి తమ పట్ల ఉంటారని కొందరు లోలోపలే భయపడుతున్నారు. అందుకే.. బ్రిటన్ ప్రధానిగా రిషిని కొందరు చూడలేకపోతున్నారు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే వివాదాస్పదమయ్యాయి.