MCD Polls : ఢిల్లీని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఓటు వేయండి : కేజ్రీవాల్
ABN , First Publish Date - 2022-12-04T12:09:32+05:30 IST
ఢిల్లీ నగర పాలక సంస్థ (MCD)లో నిజాయితీతో పని చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం
న్యూఢిల్లీ : ఢిల్లీ నగర పాలక సంస్థ (MCD)లో నిజాయితీతో పని చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఓటు వేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన, సుందర నగరంగా ఢిల్లీని తీర్చిదిద్దడం కోసం నేడు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 7న జరుగుతుంది.
నిజాయితీగల పార్టీకి, మర్యాదస్థులకు ఓటు వేయాలని కోరారు. అవినీతి, గూండాయిజం, ఇతరులను దూషించేవారికి ఓటు వేయవద్దని కోరారు. ఢిల్లీని చెత్త కుప్పగా మార్చినవారికి ఓటు వేయవద్దని చెప్పారు. ఢిల్లీని పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా చేసేవారికే ఓటు వేయాలన్నారు. పని చేసేవారికి ఓటు వేయాలని, పనిని అడ్డుకునేవారికి ఓటు వేయవద్దని కోరారు. కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి, ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం తాము పని చేయగలిగే విధంగా ఓటు వేయాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.