MCD Election: కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఆప్ అభ్యర్థి, స్టింగ్ వీడియో విడుదల చేసిన బీజేపీ

ABN , First Publish Date - 2022-11-18T16:12:16+05:30 IST

న్యూఢిల్లీ: ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపై మరోసారి బీజేపీ సంచలన ఆరోపణలు ...

MCD Election: కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఆప్ అభ్యర్థి, స్టింగ్ వీడియో విడుదల చేసిన బీజేపీ

న్యూఢిల్లీ: ఎంసీడీ ఎన్నికల్లో (MCD elections) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అవినీతిపై మరోసారి భారతీయ జనతా పార్టీ (BJP) సంచలన ఆరోపణలు చేసింది. ఆప్ నేత, ఎంసీడీ ఎన్నికల అభ్యర్థి అయిన ముకేష్ గోయెల్ (Mukesh Goel) ఒక ఎంసీడీ ఇంజనీర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ (Sting operation) వీడియోను శుక్రవారంనాడు విడుదల చేసింది. డిసెంబర్ 4న జరుగనున్న ఎంసీడీ ఎన్నికల్లో ఆదర్శ్ నగర్ నుంచి ముకేష్ గోయెల్ పోటీ చేస్తున్నారు.

పార్టీ నేతలకు గిఫ్ట్‌లు ఇవ్వాలంటూ ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ నుంచి కోటి రూపాయలను ముకేష్ గోయెల్ డిమాండ్ చేశారని బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేస్తూ, ఇంకెతమాత్రం ఆలస్యం కాకుండా ఆయనను పార్టీ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలగించాలని డిమాండ్ చేసింది.

దీపావళి గిఫ్ట్‌లు ఇవ్వాలంటూ...

కాగా, 100 నుంచి 150 మంది నాయకులకు దీపావళి బహుమతులు ఇవ్వాలని చెబుతూ ఎంసీడీ ఇంజనీర్ నుంచి గోయెల్ కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర శుక్రవారం మీడియో సమావేశంలో తెలిపారు. కేజ్రీవాల్‌కు గోయెల్ కుడిభుజం అని, ఆయనను సంప్రదించకుండా ఎంసీడీకి చెందిన ఏ విషయంలోనూ సీఎం నిర్ణయం తీసుకోరని చెప్పారు.

కల్పిత వీడియో అంటూ కొట్టివేసిన గోయెల్

మరోవైపు, బీజేపీ ఆరోపణలను ముకేష్ గోయెల్ తోసిపుచ్చారు. ఇది పూర్తిగా కల్పిత వీడియో అని, ఎంసీడీలో బీజేపీ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాషాయం పార్టీ (బీజేపీ) ఇలాంటి ఎత్తుగడలు పన్నుతోందని అన్నారు. కల్పిత వీడియో విడుదలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ ఎంసీడీలో 15 ఏళ్లుగా బీజేపీ అవినీతికి పాల్పడుతోందని, దీనిపై ఢిల్లీ ప్రజలు విసిగెత్తిపోయారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించనున్నారని అన్నారు. ఐదుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న గోయెల్ గత ఏడాది నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.

Updated Date - 2022-11-18T16:12:18+05:30 IST