బీర్బల్ చాతుర్యం!
ABN , First Publish Date - 2022-11-10T22:59:21+05:30 IST
అక్బర్ రాజ్యమది. అక్కడ కొలువులో ఉండే బీర్బల్‌కి మంచి పేరుంది. ఆయననే అక్బర్ ఇష్టపడేవారు. ఇది చూసి ఇద్దరికి అసూయ కలిగింది. వారిలో చాంద్ అనే వ్యక్తి అక్బర్ దగ్గర తాను ..
అక్బర్ రాజ్యమది. అక్కడ కొలువులో ఉండే బీర్బల్‌కి మంచి పేరుంది. ఆయననే అక్బర్ ఇష్టపడేవారు. ఇది చూసి ఇద్దరికి అసూయ కలిగింది. వారిలో చాంద్ అనే వ్యక్తి అక్బర్ దగ్గర తాను ఉండాలనుకున్నాడు. ఇందుకోసం ఓ ఆలోచన వచ్చింది. దాన్ని అమలు చేయాలనుకున్నాడు. అక్బర్ తన సభలో ఆసీనులై ఉండగా అందరూ చూస్తున్నారు. అంతలోనే చాంద్ లేచి నిలబడ్డాడు. ఒక ప్రశ అడుగుతా? మీరు సమాధానం చెప్పగలరా? అసలు మీకు తెలుసా? అని బీర్బల్‌ను అడిగాడు చాంద్. తాను మనసులో ‘అక్బర్ ఇది చెప్పలేడు. కచ్చితంగా తన స్థానం నాకే దక్కుతుంది’ అని విర్రవీగాడు మనసులో.
‘చాంద్‌గారూ అడగండి’ అన్నారు బీర్బల్. ‘ఏమీ లేదు. చిన్న ప్రశ్న. ఈ ఆగ్రా నగరంలో ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి?’ అని అడిగాడు. బీర్బల్ కంగారు పడలేదు. సహనంతో ఇలా అన్నాడు. ‘అంతేనా మిత్రమా... రేపటివరకూ సమయం ఇవ్వండి’ అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. చాంద్ మాత్రం మనసులో సంతోషపడ్డాడు. మరుసటి ఉదయమే సభ ప్రారంభమైంది. రాజుతో సహా మంత్రులు, సేనాధిపతులు, ప్రజలు ఆసీనులయ్యారు. బీర్బల్ లేచాడు. నిన్నటి ప్రశ్నకు నా జవాబు- 19, 537 అన్నాడంతే. వెంటనే చాంద్ లేచి ‘ఇది అబద్ధం. వాటిని లెక్కించలేదు’ అన్నాడు కోపంతో. ఒకవేళ అంతకంటే తక్కువా ఉండొచ్చు? ఎక్కువ ఉండొచ్చు? అన్నాడు. బీర్బల్ సహనంతో ఇలా అన్నాడు. ‘19,537 కంటే తక్కువ ఉంటే మన ఊరి పిచ్చుకలు వేరే నగరంలోని తన బంధువుల ఇంటికి వెళ్లినట్లు. ఒకవేళ ఎక్కువ పిచ్చుకలు ఉంటే ఇతర నగరాల్లోని పిచ్చుకలు మన నగరానికి వచ్చినట్లు’ అన్నాడంతే. సభంతా పగలబడి నవ్వారు. శభాష్ అంటూ అక్బర్ చప్పట్లు కొట్టాడు. అందరూ చప్పట్లు కొట్టారు. బీర్బల్ చాతుర్యం, తెలివికి అందరూ ఆశ్చర్యపోవడమే కాదు ఆనందపడ్డారు. బీర్బల్‌కు బంగారు నాణెం ఇచ్చి సత్కరించాడు అక్బర్.