UAE: నివాసితులకు యూఏఈ గట్టి వార్నింగ్.. అలా చేస్తే కోటి రూపాయల వరకు జరిమానా!
ABN , First Publish Date - 2022-12-18T08:39:06+05:30 IST
చట్టాన్ని ఉల్లంఘించేలా ఇతరులను ప్రేరేపించకూడదని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (UAE Public Prosecution) నివాసితులను (Residents) వార్నింగ్ ఇచ్చింది.
అబుదాబి: చట్టాన్ని ఉల్లంఘించేలా ఇతరులను ప్రేరేపించకూడదని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (UAE Public Prosecution) నివాసితులను (Residents) వార్నింగ్ ఇచ్చింది. నేరాలు, జరిమానాల చట్టంలోని (Crimes and Penalties Law) 2021 ఫెడరల్ డిక్రీ-లా నం. 31లోని ఆర్టికల్ 209 ప్రకారం చట్టాలను ఉల్లంఘించేలా ప్రేరేపించడం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. "చట్టాలకు కట్టుబడి ఉండకూడదని ఇతరులను ప్రేరేపించవద్దని" తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా నివాసితులను కోరింది. అలాంటి కేసుల్లో నిందితులకు జైలు శిక్షతో పాటు 1లక్ష నుంచి 5లక్షల దిర్హమ్స్ (రూ. 22.51లక్షల నుంచి రూ.1.12కోట్లు) వరకు జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో రెసిడెంట్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.