NIMS: బెడ్ దొరకదు స్ట్రెచర్ ఉండదు
ABN , First Publish Date - 2022-10-08T16:20:03+05:30 IST
నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో బెడ్ దొరకాలంటే గంటల కొద్దీ అంబులెన్స్‌లో నిరీక్షించాల్సిందే. కనీసం రెండు గంటలు గడిస్తే కానీ అక్కడ పడక దొరకడం గగనమే.
నిర్లక్ష్యం పేరు ‘నిమ్స్’2
నిమ్స్ ఎమర్జెన్సీకి వెళ్తే అంబులెన్స్‌లోనే పడిగాపులు
ఒక బెడ్ ఖాళీ అయితేనే.. మరొకరికి..
పడకలు పెరిగినా.. మారని పరిస్థితి
బెడ్ కావాలంటే పెద్దలు ఫోన్ చేయాల్సిందే
‘ఔట్ సోర్సింగ్’ ఇష్టారాజ్యం
ప్రాణాపాయ పరిస్థితుల్లో నిమ్స్‌కు వెళ్తే సత్వర చికిత్స దొరుకుతుందని భావించడం పొరపాటే. పేషెంట్‌ను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలంటే అక్కడ వీల్‌చైర్ దొరకదు. నడవలేని స్థితిలో ఉన్న రోగికి స్ట్రెచర్ కూడా ఉండదు. అందుకే ఆస్పత్రి అత్యవసర బ్లాక్ ముందు అంబులెన్స్‌లు ఎప్పుడూ నిలిచే ఉంటాయి. అందులోనే రోగులు పడిగాపులు కాస్తారు.
హైదరాబాద్ సిటీ: నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో బెడ్ దొరకాలంటే గంటల కొద్దీ అంబులెన్స్‌లో నిరీక్షించాల్సిందే. కనీసం రెండు గంటలు గడిస్తే కానీ అక్కడ పడక దొరకడం గగనమే. ఒక బెడ్ ఖాళీ అయితేనే మరో రోగికి కేటాయించాల్సిన దుస్థితి ఏర్పడింది. సహాయకులు రోగిని అంబులెన్స్‌లోనే ఉంచి ఎప్పుడు బెడ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. పేషెంట్ సీరియస్ కండీషన్‌లో ఉన్నా.. పడక లేదనే సమాధానమే సిబ్బంది నోటి నుంచి వస్తోంది. విషమంగా ఉన్న రోగుల పరిస్థితి దారుణంగా మారుతోంది. మంత్రి హరీశ్‌రావు ఇటీవల నిమ్స్‌లో ఎమర్జెన్సీ పడకల సంఖ్యను 200 వరకు పెంచారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు.
పడక దొరికేంత వరకూ..
నిమ్స్‌కు వచ్చే కేసులు దాదాపు అత్యవసరమైనవే ఉంటాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు, గుండెపోటు, పక్షవాతం వచ్చిన రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచీ ఇక్కడకు తీసుకువస్తారు. విషమ పరిస్థితిలో ఉన్న రోగికి కూడా వెంటనే బెడ్ దొరికే పరిస్థితి లేదు. ఒక్కోసారి బెడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ అక్కడ తిష్ట వేసే కార్పొరేట్ ఆస్పత్రుల ఏజెంట్లు తప్పుడు సమాచారం ఇచ్చి కార్పొరేట్ ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారు. ఇక్కడ వెంటనే బెడ్ దొరకాలంటే ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఫోన్ చేయాల్సిందే.
వీల్‌చైర్లు, స్ట్రెచర్లు దొరికితే ఒట్టు
ఔట్ పేషెంట్ రోగిని వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లాలంటే అక్కడ వీల్‌చైర్ దొరకదు. స్ర్టెచర్లూ ఉండవు. రోగులను వార్డులకు తిప్పాలంటే బాయ్స్, అటెండర్లు ఉండరు. స్ర్టెచర్లు, వార్డుబాయ్‌లు ఎక్కడ ఉంటారో తెలుసుకునేందుకు రోగి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు బంధువులే ఎత్తుకుని తీసుకు వెళ్తున్నారు.
బంధువులకు తప్పని అవస్థలు
నిమ్స్‌కు న్యూరాలజీ, అర్థోపెడిక్, గుండె, కేన్సర్, మూత్రపిండాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తుంటాయి. వృద్ధులు, నడవలేని వారు వారిలో ఉంటారు. ఆపరేషన్ అయిన బాధితులు, కాలు విరిగి కదలేని స్థితిలో ఉన్న రోగులు తరచుగా ఓపీలో ఫాలోఅప్ చెకప్ కోసం వస్తుంటారు. అలాంటి వారికి ఆస్పత్రి గేట్ వద్దే వీల్‌చైర్లు, స్ర్టెచర్లు ఏర్పాటు చేయాలి. కానీ.. ఓపీ విభాగం వద్ద అవి కనిపించవు. నాలుగో తరగతి సిబ్బంది మచ్చుకైనా ఉండరు. ఎక్కువగా రోగి తాలుకు బంధువులే డాక్టర్ వద్దకు తరలించాల్సి వస్తోంది.
ఎమర్జెన్సీ అయినా..
రోగులు అనేక రకాల సమస్యలతో ఎమర్జెన్సీకి వస్తున్నారు. కొందరిని స్ర్టెచర్లపైనే గంటల తరబడి ఉంచేస్తున్నారు. ఇక్కడకు వచ్చే రోగులను సర్జికల్, మెడికల్, క్రిటికల్, న్యూరో, కార్డియాలజీ ఇలా.. అనేక విభాగాలకు వెంట వెంటనే తరలించాలి. ఏ వైద్యుడు ముందు చికిత్సలు అందించాలనే అంశంపై ఆ విభాగ సిబ్బందికి వెంటనే స్పష్టత రాకపోవడంతో రోగులు స్ర్టెచర్‌పైనే గంటల తరబడి ఉంటున్నారు. ఆస్పత్రి వర్గాల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కనిపించని ఔట్ సోర్సింగ్ సిబ్బంది
నిమ్స్ ఔట్ సోర్సింగ్‌లో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులున్నారు. వారి వేతనాల కోసం నెలకు రూ.4 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఈ కాంట్రాక్టర్లు 15, 20 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరు సేవలు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది అసలు వార్డులో ఉండరు. ఎవరికైనా సేవలు అందిస్తే వారికి ఎంతో కొంత చెల్లించుకోవాల్సిందే. ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎంత మంది సిబ్బంది ఉన్నారు, ఎందరు డ్యూటీకి వస్తున్నారు, విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారా, అనే వివరాలను ఆరా తీసేవారు లేరు. వేతనాలను మాత్రం లెక్కకట్టి కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఔట్ సోర్సింగ్‌లోని కొందరి సెక్యూరిటీ సిబ్బంది పనితీరు రోగులకు ఇబ్బందులు కలిగిస్తోంది.
ఆస్పత్రిలో సొంత వ్యవహారాలు
ప్రజా ప్రతినిధుల అండ చూసుకుని కొంత మంది యూనియన్ లీడర్లు అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. రోగులకు సేవలు అందించకుండా, ఆఫీసు పనులు నిర్వహించకుండా సొంత కార్యక్రమాలను చక్కబెట్టుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాలకు కొందరు నిమ్స్‌ను అడ్డాగా వినియోగించుకుంటున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.