moinabad farm house: నందకుమార్‌‌కు షాక్.. హోటల్‌ కూల్చివేత

ABN , First Publish Date - 2022-11-13T15:51:23+05:30 IST

నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు.

moinabad farm house: నందకుమార్‌‌కు షాక్.. హోటల్‌ కూల్చివేత

హైదరాబాద్: నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల (TRS MLAs) కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫిల్మ్‌నగర్‌ (Filmnagar)లోని డెక్కన్‌ హోటల్‌ దగ్గర కమర్షియల్ భవనాన్ని కూలగొట్టారు. నందకుమార్ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్రమ నిర్మణాలు చేపడతున్నాడని, అందువల్లే కూల్చివేస్తున్నామని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు తెలిపారు. అయితే భవనం కూల్చివేతను నందుకుమార్‌ భార్య చిత్ర అడ్డుకున్నారు. తమ లీజ్ ల్యాండ్‌లో అక్రమంగా కూల్చివేతలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భవనం కూల్చివేశారంటూ ఆరోపించారు. అన్ని ఆధారాలను అధికారులకు అందిస్తామని చిత్ర తెలిపారు.

ఎవరీ నందకుమార్..

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యహారంలో ఇద్దరు స్వామీజీలతోపాటు.. హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ (Nandakumar) అలియాస్‌ నందును పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్ర భారతి అలియాస్‌ వీకే సతీశ్‌శర్మ, తిరుపతికి చెందిన సింహయాజులు, నందకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో ఫామ్‌హౌస్‌ (farm house)లో బేరసారాలు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు. నందకుమార్‌ ఢిల్లీ స్థాయిలోనూ మధ్యవర్తిత్వం జరుపుతాడని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. నందకుమార్‌ (డెక్కన్‌ ప్రైడ్‌ హోటల్‌ యజమాని) అని సైబరాబాద్‌ సీపీ వెల్లడించారు. సతీశ్‌ శర్మ, సింహ యాజులను నందకుమారే హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే సమయంలో.. డెక్కన్‌ ప్రైడ్‌ హోటల్‌ యజమాని నందకుమార్‌ను అక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా తాను పూజల కోసం వచ్చానని సైగలు చేసి చెప్పడం గమనార్హం.

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)లను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు.

Updated Date - 2022-11-13T16:12:22+05:30 IST