MP Arvind: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
ABN , Publish Date - Jan 14 , 2025 | 04:30 PM
సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు.
ఢిల్లీ: సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు. పదేళ్లలో కరెంటు అదనంగా ఉత్పత్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని ఎంపీ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని, ఆ పార్టీ త్వరలో భూస్థాపితం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. వ్యవసాయశాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదంటూ ఎంపీ చురకలు అంటించారు. దమ్ముంటే తుమ్మల చెరకు ఫ్యాక్టరీలు తెరిపించాలని సవాల్ చేశారు. మంత్రి తుమ్మల లేఖలు రాస్తే పసుపు బోర్డు రాలేదని ఎంపీ ధర్మపురి చెప్పుకొచ్చారు.
మోదీ జీ.. ధన్యవాదాలు..
పసుపు బోర్డు ఏర్పాటులో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పాత్ర ఎంతో ఉందని ఎంపీ ధర్మపురి తెలిపారు. నిజామాబాద్‌కి పసుపు బోర్డు తీసుకొస్తాననే పూర్తి నమ్మకం తనకు ఉండేదని చెప్పారు. అదే నమ్మకంతో కష్టపడి పని చేసినట్లు చెప్పుకొచ్చారు. తన ప్రయత్నాలు ఫలించి సంక్రాంతి పండగ రోజు బోర్డును రైతన్నలకు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు నేపథ్యంలో ఎన్నో రాజకీయాలు జరిగాయని, 2019 నుంచి ఇప్పటివరకూ తనను ఎలా టార్గెట్ చేశారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. గుండాలను పంపించి తన ఇళ్లపై దాడి చేశారని, అయినా తాను మాత్రం తలొగ్గలేదని అన్నారు.
బాధ్యత పెరిగింది..
తెలంగాణ బీజేపీ నేతల కృషి ఫలితంగానే 33 ఏళ్ల తర్వాత దేశంలో పసుపు బోర్డు ఏర్పాటు అయ్యిందని ఎంపీ అరవింద్ చెప్పారు. పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి ఎంపికయ్యారని, తన రాజకీయ ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంతో ఉందని అరవింద్ తెలిపారు. పల్లె గంగారెడ్డిది రైతు కుటుంబమని, దీని వల్ల అన్నదాతల కష్టాలు ఆయనకు బాగా తెలుస్తాయని చెప్పారు. దీని వల్ల వారికి మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని ఎంపీ చెప్పుకొచ్చారు. పల్లె గంగారెడ్డి కష్టజీవని పసుపు రైతుల ఆదాయం రెట్టింపు చేసే చర్యలు ఆయన చేపడతారని అరవింద్ చెప్పుకొచ్చారు. పసుపు బోర్డు రావడంతో ఆయనపై మరింత బాధ్యత పెరిగిందని ఎంపీ అరవింద్ చెప్పారు.
కొందరికే కాదు..
పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే ఉపయోగం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారని, కానీ దాని వల్ల అందరికీ లాభం ఉంటుందని ఎంపీ అరవింద్ చెప్పారు. మరిన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటే పసుపు మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలు సైతం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. నిజామాబాద్‌లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతలకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, ప్రస్తుతం వారి జీవనోపాధి తక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. పసుపు బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిజామాబాద్ ప్రజలకు లిక్కర్ వద్దు పసుపు బోర్డు ముద్దంటూ ఆయన స్లోగన్ చెప్పారు. తాను రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చానని, భవిష్యత్తులో మరిన్ని హామీలు నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో 10 రైల్వే ఆర్వోబీలు నిర్మించాలని, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ తాను ముందుకెళ్తానని ఎంపీ అరవింద్ చెప్పారు.