Thota Chandrasekhar: ఏపీ కూడా తెలంగాణలా అభివృద్ధి చెందాలంటే..
ABN , First Publish Date - 2023-08-15T15:15:58+05:30 IST
స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా ఏపిలో అక్షరాస్యత, త్రాగునీరు, సాగునీరు, ఉపాధి సమస్యలు ఉన్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.
గుంటూరు: స్వాతంత్ర్య వచ్చి 77 ఏళ్లు అయినా ఏపీలో అక్షరాస్యత, త్రాగునీరు, సాగునీరు, ఉపాధి సమస్యలు ఉన్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (AP BRS Chief Thota Chandrasekhar) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కులం, మతం ప్రాతిపదికన ఏపీలో పాలన జరుగుతుందన్నారు. రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవడం ఏపీ ప్రజలకు సిగ్గుచేటని వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ స్టేటస్ అంటూ మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువునా ముంచిందన్నారు. ప్రత్యేక హోదా కావాలని అడిగే పార్టీ యే ఏపీలో లేదన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందన్నారు. ప్రక్కనే ఉన్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని.. రెండు కోట్ల ఎకరాలు సాగులోకి తీసుకు వచ్చిన ఘనత కేసీఆర్ దే (Telangana CM KCR) అని చెప్పుకొచ్చారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. సంక్షేమ పథకాలు అమలులో కూడా తెలంగాణ ముందు స్థానంలో ఉందన్నారు. 35 వేల మందికి ఉద్యోగం ఇచ్చే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కన్నుపడిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చే సత్తా ఈ నాయకులకు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వెళుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణలాగా అభివృద్ధి చెందాలంటే బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని తోట చంద్రశేఖర్ కోరారు.