Tirumala YCP flag: వెంకన్న కొండపై వైసీపీ జెండా!
ABN , First Publish Date - 2023-05-22T02:22:23+05:30 IST
పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఒకేరోజు రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

తిరుమలలో యువకుల హల్‌చల్
వాహనంపై పెట్టుకుని తిరిగిన వైనం
శ్రీవారి ఆలయానికి సమీపంలో
ఓ దుకాణంలో మద్యం బాటిళ్లు స్వాధీనం
తిరుమల, మే 21(ఆంధ్రజ్యోతి): పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఒకేరోజు రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ జెండాతో ఓ వాహనంలో యువకులు హల్‌చల్ చేయగా.. ఆలయానికి సమీపంలోని ఓ దుకాణంలో ఐదు మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. తిరుమలకు రాజకీయ జెండాలు, కరపత్రాలు, వ్యక్తుల ఫొటోలు, చిహ్నాలను తీసుకురావడం నిషేధం. అలా ఎవరైనా వస్తే అలిపిరి చెక్‌పాయింట్‌లోనే భద్రతా సిబ్బంది తనిఖీ చేసి వారిని అడ్డుకుంటారు. అయితే ఆదివారం మధ్యాహ్నం థార్ వాహనం ముందుభాగంలో వైసీపీ జెండా పెట్టుకుని కొందరు యువకులు కొండపై తిరిగారు. ఆ జెండాపై ‘ఫ్యాను గుర్తుకే మీ ఓటు’ అని రాసి ఉంది. దీనిపై భద్రతాఽధికారులను అడగ్గా.. నెల్లూరుకు చెందిన సుభాన్‌తోపాటు మరో నలుగురు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారని, నిబంధనలు తెలియక తిరుగు ప్రయాణంలో వైసీపీ జెండాను వాహనం ముందు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
దుకాణంలో మద్యం బాటిళ్లు
ఆదివారం వేకువజామున శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న హెచ్‌టీ కాంప్లెక్స్‌లోని 78వ నంబరు దుకాణంలో ఐదు మద్యం బాటిళ్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్.రాజశేఖర్ అనే వ్యక్తి మరొకరితో కలిసి మద్యం సేవిస్తున్నాడనే సమాచారంతో అధికారులు తనిఖీ చేశారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్‌పై పాత కేసులున్న నేపథ్యంలో టీటీడీ రెవెన్యూ విభాగం అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. తిరుపతి నుంచి మద్యం బాటిళ్లు తీసుకువచ్చి తిరుమలలో తాగడమే కాకుండా దుకాణాల్లో పనిచేసే వారికీ రాజశేఖర్ విక్రయిస్తున్నట్టు సమాచారం.