TTD Drone Camera: అనుమతి ఇచ్చి వదిలేశారా..!?
ABN , First Publish Date - 2023-01-22T02:44:21+05:30 IST
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ అధికారుల ఉదాశీనతే ఇంతవరకూ తెచ్చిందని భక్తులు మండిపడుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన సంస్థ పనేనా?
వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై సర్వే కోసం తిరుమలకు
డ్రోన్ కెమెరాలు తెచ్చుకొనేందుకు అనుమతి
ఆ తర్వాత పట్టించుకోని టీటీడీ అధికారులు
కొండపై కీలక ప్రాంతాల చిత్రీకరణ
ఎవరూ వెంట లేకపోవడంతో ఆనంద నిలయంపైకీ డ్రోన్
తిరుమల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ అధికారుల ఉదాశీనతే ఇంతవరకూ తెచ్చిందని భక్తులు మండిపడుతున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల ఆలయంపై విమానాలు ప్రయాణించకూడదు. ఇందు లో భాగంగానే తిరుమలను ‘నో ఫ్లైయింగ్ జోన్’ కింద ప్రకటించాలంటూ టీటీడీ ఇప్పటికే కేంద్రాన్ని పలుమార్లు కోరింది. అలాగే భద్రతా కారణాల రీత్యా డ్రోన్లు కూడా తిరుమలలో ఎగరకూడదని, కొండపైకి డ్రోన్ కెమెరాలు తీసుకురాకూడదని నిబంధనలు విధించారు. అయితే తాజాగా తిరుమల ఆలయాన్ని చిత్రీకరించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక్కడే ఓ అంశం అనుమానాలకు తావిచ్చింది. తిరుమలలో వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వే నిమిత్తం హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు టీటీడీ నవంబరులో అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. ఆ సంస్థ సిబ్బంది తిరుమలకు డ్రోన్లను తీసుకువచ్చి, ముఖ్యమైన ప్రాంతాలను రికార్డు చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోను కూడా అప్పుడే చిత్రీకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ సంస్థ సర్వే చేసే సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, సిబ్బంది వెంట లేకపోవడంతోనే డ్రోన్ కెమెరా ఆలయంపైకి వెళ్లి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాంటీ డ్రోన్ టెక్నాలజీపై టీటీడీ దృష్టి
తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా వీడియో వైరల్‌గా మారిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ‘యాంటీ డ్రోన్ టెక్నాలజీ’పై విజిలెన్స్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ అమలుచేయడం ద్వారా జామర్లు డ్రోన్లసిగ్నళ్లను అడ్డుకుంటాయి. తద్వారా డ్రోన్లు ఎగిరేందుకు అవకాశముండదని టీటీడీ భావిస్తోంది.
డ్రోన్ వీడియో నిందితులపై కఠిన చర్యలు
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి
డ్రోన్ విజువల్స్ వ్యవహారంలో ఒకరిపై కేసు నమోదు
తిరుమల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి రెండు, మూడురోజుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్టు చేసినట్టు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. ఈ వీడియోను డ్రోన్ ద్వారా చిత్రీకరించారా లేక పాత ఫొటోలతో మార్ఫింగ్ చేసి త్రీడీలోకి మార్చి భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారా అనేది ల్యాబ్ నివేదిక ఆధారంగా తెలుస్తుందని పేర్కొన్నారు.
కిరణ్‌పై కేసు నమోదు
శ్రీవారి ఆలయంపైకి డ్రోన్ పంపి వీడియో రికార్డు చేసిన కేసులో కిరణ్ అనే వ్యక్తిపై ఐపీసీ 447 సెక్షన్ కింద తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాతో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆలయ భద్రతా నియమాల ఉల్లంఘనతో పాటు అసాంఘిక శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించినందుకు కేసు నమోదు చేశారు.
భద్రతా సిబ్బంది వైఫల్యం: బీజేపీ
శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా ఎగరడం తిరుమలలో భద్రతా వైఫల్యమని బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. డ్రోన్ చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే టీటీడీ ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని చెబుతోందన్నారు. వెంటనే ఈ వీడియో వెనుక ఉన్న వ్యక్తులను, శక్తులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.