Ayyannapatrudu: ప్రశ్నించిన వారికి విజయసాయిరెడ్డి కులాలు అంటగడుతున్నారు
ABN , First Publish Date - 2023-11-04T20:58:27+05:30 IST
ప్రశ్నించిన వారికి కులాలు, కుటిల రాజకీయాలు అంటగట్టే అలవాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )కి ఉందని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ( Ayyannapatrudu ) అన్నారు.
అమరావతి: ప్రశ్నించిన వారికి కులాలు, కుటిల రాజకీయాలు అంటగట్టే అలవాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )కి ఉందని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ( Ayyannapatrudu ) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పలేక ఆమెపై వ్యక్తిగత ధూషణలకు దిగజారాడు.విజయసాయిరెడ్డి అవినీతి, నేరాలు చర్చనీయాంశాలయ్యాయి. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేని దుస్థితికి విజయసాయిరెడ్డి దిగజారాడు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం, సిద్ధాంతాలు, నీతి నియమాలు గాలికొదిలేసి అడ్డదారులు తొక్కడం వైసీపీ నేతల సంస్కృతి అయింది. త్వరలో మూసేసే వైసీపీ కార్యాలయం ముందు ‘టులెట్’ బోర్డు పట్టుకోవడానికి విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉండాలి. ఇసుక, మద్యం, గనులు వంటి అనేక వ్యవహారాల్లో వైసీపీ పెద్దల అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో ఎండగడుతున్నారని పురందేశ్వరిపై వైసీపీ నేతలు పోటీపడి విషం చిమ్ముతున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడం, ప్రకృతి వనరులను మింగేయడం ఒకే కులానికి అన్ని పదవులు కట్టబెడుతూ, బడుగు బలహీనవర్గాలను వంచించడమే అజెండాగా సాగుతున్న జగన్‌రెడ్డి అరాచక పాలనను ప్రశ్నించడం నేరమా..? నోరెత్తిన వారిపై కేసులు పెట్టడం, దుష్ప్రచారం చేయడం మీ నైజం కాదా’’..? అని అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.