Jagan Govt: అక్క చెల్లెమ్మల ఆక్రోశం!

ABN , First Publish Date - 2023-04-16T02:28:55+05:30 IST

ప్రభుత్వ పెద్దలు నిత్యం చెప్పే మాట ‘సంక్షే మం’. తమ ఏలుబడిలో పేదలను ఉద్ధరిస్తున్నట్టు చెబుతున్నారు. బహిరంగ సభ అయినా, అసెంబ్లీ అయినా, బటన్‌ నొక్కుడు కార్యక్రమం అయినా ఓ రేంజ్‌లో గొప్పలు చెబుతుంటారు.

Jagan Govt: అక్క చెల్లెమ్మల ఆక్రోశం!

సంక్షేమాన్ని మించి బాదుడే బాదుడు

పాత పథకాలే పేరు, తీరుమార్చి అమలు

అదే గొప్ప ‘సంక్షేమం’గా గొప్పలు

ఇస్తున్నట్లే ఇచ్చి.. రకరకాలుగా బాదుడు

గతంలో ఉన్న పలు పథకాలు బంద్‌

‘చేయూత’ ఒక్కటే కొత్త పథకం

సంక్షేమం ఇలా

అంతకుముందున్న పథకాలకే పేరు మార్చేశారు. అమలు చేస్తున్న తీరు మార్చేశారు. సంక్షేమాన్ని తామే కనిపెట్టినట్లుగా గొప్పలకు పోతున్నారు. ‘నా అక్క చెల్లెమ్మలు’ అంటూ ఊరూరా సెంటిమెంటు గుమ్మరిస్తున్నారు. కానీ... జగన్‌ సర్కారు గొప్పగా చెప్పుకొంటున్న సంక్షేమంపై 90 శాతం మంది అక్కచెల్లెమ్మలు పెదవి విరుస్తున్నారు.

బాదుడు ఇలా..

చెత్త పన్ను : జగన్‌ సర్కారు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రజలపై ‘చెత్త’ పన్ను వేసింది.

ఇంటి పన్ను: ప్రతిఏటా ఇంటి పన్ను, ఆస్తి పన్ను పెంచుతూ పోతోంది.

కరెంటు చార్జీలు : ట్రూ అప్‌ పేరుతో విద్యుత్‌ చార్జీలను ఆరేడుసార్లు పెంచారు.

బస్‌ చార్జీలు : వైసీపీ పాలనలో బస్సు చార్జీలు మూడుసార్లు పెరిగాయి.

పెట్రోలు : పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో లీటరు పెట్రోలు 11 రూపాయల వరకు అధికం. వ్యాట్‌, సెస్‌ల బాదుడే దీనికి కారణం.

ధరలు : నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. పాలు, బియ్యం, పప్పులు, కూరగాయలు, వంట నూనెల ధరలు ఆకాశాన్నంటాయి.

మద్యం : సర్కారీ మద్యంతో ఇల్లూ ఒళ్లూ గుల్ల అవుతున్నాయి.

9ammavodi.jpg

జగన్‌ ఏలుబడిలో ఇంటి ఖర్చు డబుల్‌

నిత్యావసరాల ధరలతో పేదలు విలవిల

మరోవైపు పన్నులు, చార్జీల బాదుడు

ఇల్లూ, ఒళ్లు గుల్ల చేసే సర్కారీ మద్యం

మొత్తం లక్ష కోట్లకు పైగా ఖజానాకు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ప్రభుత్వ పెద్దలు నిత్యం చెప్పే మాట ‘సంక్షే మం’. తమ ఏలుబడిలో పేదలను ఉద్ధరిస్తున్నట్టు చెబుతున్నారు. బహిరంగ సభ అయినా, అసెంబ్లీ అయినా, బటన్‌ నొక్కుడు కార్యక్రమం అయినా ఓ రేంజ్‌లో గొప్పలు చెబుతుంటారు. కానీ... జగన్‌ చెబుతున్న సంక్షేమం ఒట్టి డొల్ల అని ‘అక్క చెల్లెమ్మలే’ పేర్కొంటున్నారు. ఒక చేత్తో ఇస్తూ.. మరో చేత్తో లాక్కుంటూ బతుకు భారం చేశారని వాపోతున్నారు. పన్నులు, చార్జీలు, ధరలతో జనం విలవిలలాడిపోతున్నారు. వివిధ వర్గాలకు చెందిన దాదాపు 90 శాతం మంది మహిళలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పథకాలు పొందుతూ కూడా ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నిస్తే... కష్టాలు ఏకరువు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పథకాల లబ్ధిదారులుగా ఉన్న 45-60 ఏళ్ల మహిళలను ‘ఆంధ్రజ్యోతి’ కలిసి ప్రశ్నించింది. వీరిలో అత్యధికులు జగన్‌ సంక్షేమ పథకాల్లోని డొల్లతనాన్ని ఎండగట్టారు. ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తారనే భయంతో కొందరు తమ పేర్లు, ఫొటోలు ప్రచురించవద్దని కోరారు.

1.jpg

కోతలు, వాతలు

గత ప్రభుత్వంలో ఉన్న ఎన్నో పథకాలను జగన్‌ సర్కారు రద్దు చేసింది. మరికొన్నింటికి పేర్లు మార్చి వాటినే అమలు చేస్తూ తామే కొత్తగా ప్రవేశపెట్టినట్టు డప్పు కొడుతోంది. ఓ వైపు పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు సవాలక్ష కారణాలు, నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెడుతోంది. పేదలు, సామాన్యులకు ఎంతో ఉపయోగపడే పింఛన్లు, రేషన్‌, రైతు భరోసా సహా ఇతర పథకాలు ఇవ్వకుండా జాబితా నుంచి ఎంతోమందిని తొలగిస్తోంది. పోనీ పథకాలు ఇస్తున్నవారికైనా చిత్తశుద్ధితో అమలు చేస్తోందా అంటే... ఓ చేత్తో ఇస్తూ, మరో చేత్తో లాక్కొంటోంది. ఇక.. గతంలో ఉన్న పలు పథకాలను జగన్‌ సర్కారు రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి, ఉన్నత, మెరుగైన విద్య, ఉన్నత ఉద్యోగ శిక్షణ అవకాశాలను కాలరాసింది. చేతి వృత్తిదారులకు గతంలో ఉన్న పథకాలను రద్దు చేసింది. గత ప్రభుత్వం వారికి ఏదో ఒక పనిముట్టు ఇచ్చి సాయం చేసేది. ఇప్పుడవన్నీ బంద్‌ అయ్యాయి. ఇక సిమెంట్‌, ఇసుక, ఇనుము ధరలు భారీగా పెరిగాయి. జగన్‌ సర్కారు సంక్షేమమంటూనే ఇన్ని కోతలు, వాతలు పెట్టడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇక మద్యం వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకున్న సర్కారు... పిచ్చి పిచ్చి బ్రాండ్లు, షాక్‌ కొట్టే ధరలతో మందుబాబుల జేబులను ఖాళీ చేస్తోంది. ఈ నాలుగేళ్లలోనే మద్యం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా 80 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇక పన్నులు, చార్జీల పేరుతో వేల కోట్లు వసూలు చేస్తోంది. అంటే.. పథకాల పేరుతో ఓ చేత్తో ఇస్తూ, మరో చేత్తో లాక్కొంటోంది.

..అయినా జగన్‌కు ఓటు వేయను

చేయూత కింద రూ.18,750 చొప్పున రెండు సార్లు ఇచ్చారు. ప్రతి నెలా వితంతు పింఛను వస్తోంది. నా మనవడికి గత రెండుసార్లుగా అమ్మఒడి రాలేదు. గత ఏడాది రెండో మనవడికి అమ్మఒడి వచ్చింది. అయినా జగన్‌కు ఓటు వేయను. ఏడాదికి ఒకసారి డబ్బు ఇస్తే సరిపోతుందా? అన్ని ధరలు పెరిగిపోయాయి. కరెంటు చార్జీలు ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేవు. రోజువారీ కూలీ రూ.100 పెరిగితే ఇంట్లో ఖర్చులు రూ.200 పెరిగాయి.

- ఓ మహిళా కూలీ, పాతూరు, ఉలవపాడు, నెల్లూరు జిల్లా

9rytu.jpg

చేయూతతో అందని భరోసా

వైసీపీ సర్కారు ముఖ్యంగా మహిళలకు అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ తదితర పథకాలు అమలు చేస్తోంది. సీఎం జగన్‌ బటన్‌ నొక్కి డబ్బులు వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. జగన్‌ అమలు చేస్తున్న పథకాలు చాలా వరకు గతంలో ఏదో రూపంలో చంద్రబాబు అమలు చేసినవే. ఈ ప్రభుత్వం కొత్తగా 45-60 ఏళ్ల మహిళలకు చేయూత పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వంలో లేకుండా ఈ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తున్న పథకమిదే. అన్ని కులాల మహిళలకు ఈ పథకాన్ని వివిధ రకాల పేర్లతో అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750, ఆర్థికంగా వెనుకబడిన మిగతా వర్గాల మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తున్నారు. గతంలో ఇలాంటి పథకం లేకపోవడం, జగన్‌ సర్కారు అమలు చేయడంతో ఆ లబ్ధిదారులైనా సంతృప్తిగా ఉన్నారా? అంటే.. వారు కూడా ఆవేదనే వ్యక్తం చేస్తున్నారు. పది రూపాయలు ఇచ్చి పన్నుల రూపంలో పాతిక లాగేస్తున్నారంటూ మండిపడుతున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే జగన్‌ సర్కారును సమర్థిస్తున్నారు.

సామాన్యుల బతుకు భారం

నేను చేనేత కార్మికురాలిని. గతంలో యార్న్‌ సబ్సిడీ, ట్రిపుల్‌ఫండ్‌ స్కీం, రంగుల మీద సబ్సిడీ వంటి పథకాలు ఉండేవి. ప్రస్తుతం పథకాలేమీ లేవు. పట్టు ధరలు పెరగడంతో నేత పని తగ్గింది. దీంతో చాలామంది ఇతర పనులకు వెళ్తున్నారు. ప్రభుత్వం నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేలు ఇస్తున్న మాట వాస్తవమే. నిత్యావసర ధరలు పెరగడంతో ఏ మూలకూ సరిపోవడం లేదు. గతంలో నెలకు దాదాపు రూ.9 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడు ధరలు పెరగడంతో రెట్టింపయ్యింది.సామాన్యులు బతకడం భారంగా మారుతోంది.

- అల్లక అరుణకుమారి, వీరవరం, కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా

పథకాలు అందుతున్నా సంతోషమేదీ?

నేను, నాభర్త ల్యాండ్రీ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. చేయూత, అమ్మఒడి పథకాలు వస్తున్నాయి. కానీ సంతోషం అనేది లేదు. కరెంటు చార్జీలు నెల నెలా పెంచుతున్నారు. బస్సు చార్జీలు కూడా పెరిగాయి. నిత్యావసర సరుకులు చెప్పనక్కర లేదు.. కొద్ది సరుకులు తెచ్చుకోవాలన్నా రూ.1000 కూడా సరిపోవడం లేదు. బతుకు భారంగా ఉంది. పని చేస్తేనే మాకు జీవనం జరిగేది. సొంత ఇల్లు కూడా లేదు. రెండేళ్ల క్రితం పట్టా ఇచ్చారు కాని ఇంత వరకు ఇల్లు మంజూరు కాలేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం.

- ఓ మహిళ, అనంతసాగరం, నెల్లూరు జిల్లా

ఏడాది పొడవునా ఇబ్బందులే

పెరిగిన ధరల కారణంగా ఇల్లు గడవటం కష్టంగా ఉంది. చేయూత ద్వారా ఏడాదికి ఒక సారి డబ్బులు పడుతున్నాయి. కానీ పెరిగిన నిత్యావసరాల ధరలతో ఏడాది పొడవునా ఇబ్బందులు పడుతున్నాం. నా కుమారుడికి అటో ఉంది. డీజిల్‌ రేట్లు పెరగడం వల్ల చార్జీలు గిట్టుబాటు కావడం లేదు. నా భర్త తాపీ పనికి వెళుతుంటాడు. ఐరన్‌, సిమెంట్‌ ధరలు పెరగడంతో పనులు తగ్గాయి. పథకాల ద్వారా డబ్బులు పడినా మిగిలిన రంగాలు సక్రమంగా నడవడం లేదు.

- డి.అంకమ్మ, గరివిడి, విజయనగరం జిల్లా

సాయం కంటే ఖర్చు ఎక్కువ

నాకు రెండు ఎకరాల భూమి ఉంది. గతంలో కౌలుకిస్తే సంవత్సరానికి రూ.30 వేలు ఇచ్చేవారు. అది కాకుండా నెలకు రూ.2 వేల వితంతు పెన్షన్‌ వచ్చేది. రెండూ కలిపి సంవత్సరానికి రూ.54 వేలు వచ్చేది. అప్పట్లో నెలకు రూ.10 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడు కౌలు రూ.35 వేలు, పెన్షన్‌ నెలకు రూ.2,750 వస్తోంది. ఇప్పుడు అన్ని ధరలూ పెరిగిపోయాయి. నెల ఖర్చులు రూ.15 వేలు పైనే. నాలుగేళ్లలో ప్రభుత్వం నుంచి ఈబీసీ నేస్తం కింద ఒక్కసారి మాత్రమే రూ.15 వేలు వచ్చింది. ప్రభుత్వ సాయం కంటే ఖర్చులు చాలా రెట్లు పెరిగాయి.

- ఓ మహిళ, నాయుడుపేట, తిరుపతి జిల్లా

చంద్రబాబు కాలమే బాగుండేది

చంద్రబాబు ఉన్నప్పుడు మాకు రూ.2000 పింఛన్‌ వచ్చేది. ఆ పింఛన్‌తో బతికేవాళ్లం. జగన్‌ ప్రభుత్వంలో ఇద్దరికి (దివ్యాంగులు) రూ.5,750 పింఛన్‌ వస్తోంది. కాని సరిపోవడం లేదు. అన్ని రేట్లు ఎక్కువే. ఇల్లు గడవడమే కష్టం అయ్యింది. బిల్లు కట్టలేక ఇంట్లో కేబుల్‌ కనెక్షన్‌ కూడా తీసేశాం. చంద్రబాబు కాలమే మేలుగా ఉండేది.

- ఓ మహిళ, కలిగిరి, నెల్లూరు జిల్లా

ఇవ్వాలంటే తీసుకోవాలి కదా

వైసీపీ ప్రభుత్వం హయాంలో పఽథకాలు అధికంగా అందుతున్నాయి. గతంలో ఎవ్వరూ ఇవ్వనన్ని పఽథకాలను ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారు. ధరల పెరుగుదలతో జీవనం కష్టంగానే ఉంది. పథకాలకు సొమ్ము ఇవ్వాలంటే జనం నుంచి ఏదో రూపంలో తీసుకోవాలి కదా. జగన్‌ ప్రభుత్వం పెరిగిన ధరల (పన్నులు, చార్జీలు) నుంచి వచ్చే ఆదాయంతోనే పథకాలను అందిస్తోంది.

- రాజేశ్వరి, రామశింగవరం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా

పథకాలు సంతృప్తికరంగా ఉన్నాయి

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నేను ఏడాదికి రూ.60 వేలు అందుకుంటున్నాను. పింఛన్‌తో పాటు వైఎ్‌సఆర్‌ చేయూత వస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సంతృప్తికరంగా ఉన్నాయి.

- గంట కుమారి, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం

పథకాలు ఇచ్చి ఏం ప్రయోజనం?

ప్రభుత్వం చేయూత పథకం ద్వారా రూ.18,750 ఇస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. కరెంట్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోయాయి. నేను కూలి పనులకు వెళ్తున్నాను. పిల్లలు స్కూలుకు వెళ్తారు. చార్జీలు పెంచి చేయూత పథకం కింద డబ్బులు ఇస్తే ఏం ప్రయోజనం? పథకాల సొమ్ముతో పాటు నా కష్టార్జితంతో బతకాలంటే ఇబ్బందులు తప్పడంలేదు. సంక్షేమ పథకాలు అందించకపోయినా ఫర్వాలేదు కానీ నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి.

- కొత్తకోట సీతాలక్ష్మి, పార్వతీపురం

ఇల్లు మంజూరు చేసి...

ఈబీసీ పథకం ద్వారా రూ.15 వేలు లబ్ధి కలిగింది. టీడీపీ హయాంలో నిత్యావసరాల ధరలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు రెట్టింపయ్యాయి. గ్యాస్‌ ధరలు బాగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. జగనన్న కాలనీలో ఇంటి స్థలం ఇచ్చారు. ఆప్షన్‌-1 కింద ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇచ్చేట్టుగా చెప్పారు. తీరా ఇప్పడు రూ.35 వేలు కట్టమంటున్నారు. నా వద్ద లేవని చెబితే డ్వాక్రా ద్వారా రుణం తీసుకుని కట్టమంటున్నారు. డ్వాక్రా గ్రూపులో లేనని చెబితే, డ్వాక్రా గ్రూప్‌లో లేకపోయినా రుణాలు ఇస్తామని, రూ.35 వేలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు.

- డి.శ్రీదేవి, అంబాపురం, విజయవాడ రూరల్‌

కుటుంబ ఖర్చులకు చాలడం లేదు

మా కుటుంబానికి నవరత్నాల్లో నేతన్న నేస్తం ఏడాదికి రూ.24 వేలు వస్తుంది. అయితే అన్ని వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా చేనేత కార్మికులకు ముడి సరుకుల ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువులు పేదలకు అందుబాటులో లేకుండా పోయాయి. నేతన్న ఎంత పనిచేసినా కుటుంబ ఖర్చులకు చాలడం లేదు. జీఎస్టీ రద్దు చేసి, ధరలు తగ్గించి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నేతన్నకు ప్రయోజనం ఉంటుంది. పథకాలు ఇచ్చామని ధరలు పెంచుతూపోతే నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారు.

- చౌడం సావిత్రి, మోరగుడి గ్రామం, జమ్మలమడుగు, కడప జిల్లా

సంక్షేమమంటూనే బాదేస్తున్నారు

ప్రభుత్వం ఒక వైపు సంక్షేమం అంటూ మరోవైపు అన్ని రకాల ధరలను పెంచి బాదేస్తోంది. రెండేళ్లు సాంకేతిక కారణాలు సాకుగా చూపి చేయూత పథకానికి నన్ను అనర్హురాలిగా ప్రకటించారు. గత ఏడాది మాత్రం రూ.18,750 లబ్ధి చేకూరింది. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాలు, విద్యుత్‌, బస్సు చార్జీలు భారీగా పెరిగాయి. ఉపాధి హామీ పథకం పనులు సరిగ్గా నిర్వహించడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముమ్మరంగా పనులు లభించేవి. ఇప్పుడు సంక్షేమం పేరుతో అందిస్తున్న లబ్ధి కంటే పెరిగిన వస్తువుల కొనుగోలుకే అధికంగా వెచ్చించాల్సి వస్తోంది.

- బొడ్డు మాలకొండమ్మ, పాతసింగరాయకొండ ఎస్సీ కాలనీ, ప్రకాశం జిల్లా

జీవనం కష్టంగా ఉంది

నా భర్త, కొడుకు కూలి పనికి వెళ్తారు. నేను ఇంటి వద్ద బీడీలు చుట్టి రోజుకు రూ.100 సంపాదిస్తాను. నా భర్తకు పని దొరికితే రోజుకు రూ.500 కూలి వస్తుంది. కొడుకు అప్పుడప్పుడు పనికి వెళుతుంటాడు. నెలకు రూ.8 వేలు దాకా ఆదాయం వస్తుంది. గతంలో ఇంటి ఖర్చులు నెలకు రూ.3-4 వేలు అయ్యేవి. ఇప్పుడు సంపాదించినది ఇంటి అవసరాలకే సరిపోతోంది. అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం చేయూత ద్వారా రూ.18,750 ఇస్తోంది. పథకాల నుంచి కాస్తా లబ్ధి చేకూరుతున్నా పెరిగిన ధరల వల్ల జీవనం కష్టసాధ్యంగా ఉంది. పండుగ వస్తే అదనంగా రూ.5వేల దాకా ఖర్చు వస్తోంది. చిన్న జ్వరం వచ్చిందంటే ఆసుపత్రికి వెళ్లాలంటే రూ.1000 ఉండాలి. నాలుగేళ్లలో పోగు చేసుకున్నది ఏమీలేదు.

- శివమ్మ, అగళి, శ్రీసత్యసాయి జిల్లా

Updated Date - 2023-04-16T03:16:34+05:30 IST