CJ of High Court : హైకోర్టు సీజేగా జస్టిస్ ఠాకూర్ ప్రమాణం
ABN , First Publish Date - 2023-07-29T03:47:45+05:30 IST
రాష్ట్ర హైకోర్టు నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం 10గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నజీర్
హాజరైన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం 10గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. తొలుత జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను హైకోర్టు సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు చదివి వినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం వేర్వేరుగా ప్రధాన న్యాయమూర్తిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, న్యాయమూర్తులు తేనేటి విందులో పాల్గొన్నారు. అక్కడ జస్టిస్ ఠాకూర్‌కు చంద్రబాబు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్, పీపీ వై.నాగిరెడ్డి, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది, సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీజే జస్టిస్ ఠాకూర్ నేరుగా హైకోర్టుకు చేరుకొని జస్టిస్ ఏవీ శేషసాయితో కలసి కేసుల విచారణ చేపట్టారు.
పలకరించుకోని జగన్.. చంద్రబాబు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాగూర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఒకరినొకరు పలకరించుకోలేదు. ముందుగా ఉదయం 9.45గంటలకు హాలులోకి ప్రవేశించిన చంద్రబాబు వేదిక ముందు వరుసలో కూర్చున్నారు. ఆయనకు ఓవైపు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, మరోవైపు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. కొద్దిసేపు శాసనమండలి చైర్మన్‌తో చంద్రబాబు ముచ్చటించారు. తర్వాత కాసేపటికి గవర్నరు అబ్దుల్ నజీర్, సీఎం జగన్ మరోమార్గంలో వేదికపైకి వచ్చారు. ఈ సమయంలో జగన్, చంద్రబాబు ఒకరినొకరు చూసుకోలేదు. నమస్కార, ప్రతినమస్కారాలు చేసుకోలేదు. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత అందరూ కళాక్షేత్రం వెనుక వైపు ఏర్పాటు చేసిన తేనేటి విందుకు వెళ్లారు. అక్కడా సీఎం, ప్రతిపక్ష నేత మధ్య ఎలాంటి మర్యాదపూర్వక సంభాషణ జరగలేదు.
మిగతా 11వ పేజీలో...