Share News

Water Troughs for Livestock: ఉపాధి హామీలో పశువుల తొట్టెల నిర్మాణం

ABN , Publish Date - Apr 02 , 2025 | 07:06 AM

గ్రామాల్లో పశువులకు తాగునీటి సమస్య తప్పించేందుకు ప్రభుత్వం 12500 నీటి తొట్టెల నిర్మాణం చేపట్టింది ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ 5625 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు

Water Troughs for Livestock: ఉపాధి హామీలో పశువుల తొట్టెల నిర్మాణం

  • 12,500 తొట్టెలకు రూ.56.25 కోట్ల వ్యయం

  • 15 నాటికి పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ ఆదేశం

  • పశువులు మేతమేసి ఇంటికి తిరిగొచ్చే మార్గంలో ఏర్పాటు

  • రోజూ 25 లక్షల పశువులకు తాగునీరు

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): గోకులాల నిర్మాణం, పంట నీటికుంటల తవ్వకాన్ని ఉపాధి పథకంలో భాగంగా చేసిన విధంగానే ఇప్పుడు పాడి రైతుల కోసం మరో కార్యక్రమాన్ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ చేపట్టింది. వేసవిలో పశువులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రామాల్లో నీటి తొట్టెలను నిర్మిస్తున్నారు. గ్రామాల్లో పశు సంపదకు తాగునీటి సమస్య ఎదురు కారాదని, అందుకోసం నీటి తొట్టెలు నిర్మించాలని సీఎం నిర్దేశించడంతో అందుకు అనుగుణంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. 12,500 నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం నుంచి రూ.56.25 కోట్ల నిధులు వినియోగిస్తున్నారు. నీటి తొట్టెల నిర్మాణాలను ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేసవిలోనే ఈ తొట్టెలు సంపూర్ణంగా వినియోగంలోకి రావాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వీటి నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు. అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మణికొండలో చేసిన భూమి పూజలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజ పాల్గొన్నారు. ఒక్కో తొట్టెకు రూ.45 వేలు వ్యయం చేస్తారు. ఈ తొట్టెల ద్వారా రోజుకు 25 లక్షల పశువులు, మూగజీవాలు నీరు తాగే అవకాశముంది.


రాష్ట్రవ్యాప్తంగా 12,500 తొట్టెలు నిర్మించాల్సిన అవసరం ఉందని పశుసంవర్థక శాఖ గుర్తించింది. పశువులు మేతమేసి ఇంటికి తిరిగి వచ్చే మార్గంలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ తొట్టెలను రెండు డిజైన్లలో నిర్మించనున్నారు. ఒకటి పశువులకు మాత్రమే కాగా, మరొకటిపశువులతోపాటు మేకలు, గొర్రెలు తదితర జీవాలూ నీరుతాగేలా నిర్మించాలని నిర్దేశించారు. 3,500 లీటర్ల నీరుపట్టేలా వీటిని నిర్మించనున్నారు.

Updated Date - Apr 02 , 2025 | 07:06 AM